వ్యూహం మార్చిన వైసీపీ

వ్యూహం మార్చిన వైసీపీ

అధికార పార్టీకి మింగుడుపడని నియోజకవర్గమది. పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రత్యర్థి ఉన్నాడు అక్కడ. అతని ఓటమే లక్ష్యంగా, చినబాబు రంగంలోకి దిగారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో తేల్చుకునేందుకు రెడీ అయిపోయారు. అనుకోకుండా వచ్చిన అధినేత కొడుకును ఢీకొట్టేందుకు, ప్రతిపక్ష పార్టీ ప్లాన్ మారుస్తోంది. చినబాబుకు ధీటుగా ఆయన బంధువునే ప్రయోగించాలని భావిస్తోంది.

ఏపీ రాజధాని ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది. తనయుడి పోటీపై టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్ మంగళగిరి బరిలో నిలవడంతో…వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మంగళగిరి టికెట్ కోసం మొన్నటిదాకా వైసీపీలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన వార్…ఇప్పుడు మరో రూటు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సీటను మరోసారి ఎమ్మెల్యే ఆర్కేకు కేటాయించాలని వైసీపీ నిర్ణయించినా… తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావును బరిలో దింపాలని భావిస్తున్నట్టుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి.

లోకేశ్ భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు నుంచి పోటీ చేయనున్నారంటూ ఇంతకాలం ప్రచారం జరిగింది. కానీ, ఫైనల్ గా చంద్రబాబు లోకేశ్ కు మంగళగిరి సీటు కన్ఫామ్ చేశారు. రాజధాని ప్రాంతం కావడంతో… టీడీపీకి సానుకూలతలు ఉంటాయని చంద్రబాబు అంచనా వేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిపై 12 ఓట్ల తేడాతో ఆళ్లరామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఆర్కేకు లోకేశ్ ద్వారా చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈనేపథ్యంలోనే చినబాబుకు మంగళగిరి సీటు డిక్లేర్ చేసినట్టుగా చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. మంగళగిరి నుంచి లోకేష్‌ను పోటీకి దింపితే… ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఉంటుందని బాబు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే, మంగళగిరి టికెట్ కోసం వైసీపీలో పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉడతా శ్రీనుకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. అయితే ఇందుకు ఆర్కే ఒప్పుకోకపోవడంతో… మరోసారి ఆయనకే సీటు కేటాయించినట్టిగా తెలిసింది. అయితే అనూహ్యంగా లోకేశ్ మంగళగిరిలో తేలడంతో.. వైసీపీ స్టాండ్ మార్చనుందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో చేరే సమయంలో నార్నెకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారట. లోకేశ్‌ను ఆర్థికంగా, సామాజికంగా ఎదుర్కోకావలంటే నార్నె కరెక్ట్ అని అధినేత భావిస్తున్నారట. గుంటూరు పరిధిలోని నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నార్నే శ్రీనివాసరావు కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం.

మొత్తానికి లోకేశ్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ మామ బరిలో ఉంటే… మంగళగిరి పోటీ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *