నాటి మిత్రులే నేటి ప్రత్యర్థులు

నాటి మిత్రులే నేటి ప్రత్యర్థులు

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గంలో ఎన్నికల పోరు యుద్ధాన్ని తలపిస్తోంది. గతంలో మిత్రులుగా ఉన్నవారు ఇప్పుడు శత్రువులై హోరాహోరిగా తలపడుతున్నారు. ఆజంఖాన్‌, జయప్రదల మధ్య బిగ్‌ ఫైట్‌ నడుస్తోంది. మరి వారి బలాలేంటి.. బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రాజకీయాల్లో అనేకమంది సినీతారలు ఉన్నా ప్రస్తుతం అందరి దృష్టి జయప్రదపైనే ఉంది. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994లో టీడీపీలోకి వెళ్లిన జయప్రద.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండోసారి అవకాశం రాకపోవడంతో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. పదిహేనేళ్ల క్రితం రామ్‌పూర్‌ నవాబు కుటుంబసభ్యురాలు, కాంగ్రెస్‌ అభ్యర్థి బేగం నూర్‌బానోను ఓడించేందుకు జయప్రదను.. ఇప్పుడు ఆమెపై పోటీ చేస్తున్న ఆజంఖానే తీసుకొచ్చారు. ఆజంఖాన్‌ సహకారంతో 2004 లోక్‌సభ ఎన్నికల్లో 85 వేల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వైరం పెరగడంతో అమర్‌సింగ్‌కు గూటికి జయప్రద చేరారు. మరోవైపు ఆజంఖాన్‌ పార్టీకి దూరమై.. 2009 ఎన్నికల్లో జయప్రదను ఓడించేందుకు ప్రయత్నించారు. కానీ ముస్లిం ఓటర్లంతా ఎస్పీకి మద్దతివ్వడంతో రెండోసారి జయప్రద గెలుపొందారు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఆజంఖాన్.. తన బహిష్కరణకు కారణమయ్యారన్నది జయప్రద అభియోగం. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద 2012లో అమర్‌ సింగ్‌తో కలిసి కలసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేసి….అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ తర్వాత 2014లో జయప్రద ఎస్పీని వీడి…ఆర్‌ఎల్డీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుత ఎన్నికల్లో రామ్‌పూర్‌ నియోజవకర్గంలో ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ పోటీ చేస్తుంటే.. బీజేపీ నుంచి ఆయనకు జయప్రద గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక బిలాస్‌పూర్‌ అసెంబ్లీ నుంచి రెండు సార్లు గెలిచిన సంజయ్‌ కపూర్‌ను కాంగ్రెస్‌ బరిలో దించింది. రామ్‌పూర్‌లో నియోజకవర్గంలో 50 శాతం ముస్లిం జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది ఎస్పీ మద్దతుదారులే. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పదిసార్లు కాంగ్రెస్‌, 6సార్లు ఇతర పార్టీలు గెలుపొందాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్పీలు ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించాయి. ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య ముస్లింల ఓట్లు చీలిపోయి.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. స్థానికంగా ముస్లింలలో పలుకుబడి ఉన్న నేత కావడంతో ఆజంఖాన్‌ను ఎదుర్కోవడానికి జయప్రదను మించిన అభ్యర్థి లభించకపోవచ్చునని కమలనాథులు భావించారు. అందుకే జయప్రదను రంగంలోకి దించారు. యాదవ్‌లు, జాతవ్‌లు మద్దతు ఆజంఖాన్‌కే ఉంది. కానీ బీఎస్పీ నేతలు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. ఈ ఓట్లు జయప్రదకు సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవల ఆజంఖాన్‌ జయప్రదపై చేసిన అసభ్య వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆజంఖాన్‌ వ్యాఖ్యలపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు జయప్రద… తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న ఆజంఖాన్‌ను ఓడించాలని మహిళలకు పిలుపునిస్తూ సెంటిమెంట్‌ రగిలిస్తున్నారు. జయప్రద బలాలు చూస్తే.. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పలు అభివృద్ధి పనులు చేశారు. ప్రస్తుతం ఆమెకు ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ మద్దతు కూడా ఉంది. బలహీనతలు పరిశీలిస్తే… పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం.. బీజేపీపై ముస్లింలలో ఉన్న వ్యతిరేకత ఆమెకు మైనస్‌గా చెప్పవచ్చు. ఆజంఖాన్‌ బలాల విషయానికి వస్తే… ముస్లింలలో ఆదరణ కలిగిన నాయకుడు. యాదవ్‌లు, జాతవ్‌ల మద్దతు ఉండటంతో పాటు బలమైన కేడర్ ఉంది. వివాదాస్పద వ్యక్తిత్వం ఆజంఖాన్‌కు ఉన్న బలహీనత. మొత్తం మీద ఇక్కడ ప్రతిష్టాత్మక పోరు జరుగుతోంది. అభ్యర్థులు ఈఎన్నికను వ్యక్తిగత పోటీగా భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *