ఎవరికి ఎక్కువ వస్తే వారి వైపే : జనసేన ఎత్తుగడ!

ఎవరికి ఎక్కువ వస్తే వారి వైపే : జనసేన ఎత్తుగడ!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో…ఈసారి హంగ్ ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందని ఏపీకి చెందిన సీనియర్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. ప్రతి ఓటూ కీలకంగా మారిన దశలో గెలిచిన ప్రతి స్థానమూ అపురూపంగా మారుతుందని చెప్తున్నారు. ఈ సారి ఎన్నికలతో  రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇచ్చే మద్దతు కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఆ పార్టీ అదే నమ్మకంతో ఉంది. ఎన్నికలు మరో 20 రోజులు ఉన్నాయనగా పవన్ కళ్యాణ్ తన విమర్శలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు సంధించారు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడినా.. ఆ తర్వాత మాత్రం వైసీపీనే లక్ష్యంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి తెర వెనుక నుంచి సహకారం అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణమూ అలానే ఉంది. అయితే జనసేన పార్టీ అభ్యర్థులతోనూ, ముఖ్య నాయకులతోనూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆ పార్టీ రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లుగా చెబుతున్నారు.

కౌంటింగ్ అనంతరం తమకు వచ్చే స్థానాలు ఎన్ని…. మిగిలిన పార్టీలకు వచ్చే స్ధానాలు ఎన్నో తేలిపోతుందని, ఆ సమయంలో తమ అవసరం ఎవరికి ఉందో వారికి మద్దతు తెలుపుదామని జనసేన నాయకులు కొందరు అన్నట్లు చెబుతున్నారు. దీని ద్వారా మంత్రివర్గంలో చోటు సాధించడంతో పాటు కొన్ని కార్పొరేషన్ పదవులూ దక్కుతాయని, వాటిని అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లొచ్చన్నది జనసేన నాయకుల అభిప్రాయంగా చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో వైరం కంటే స్నేహం చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందే కానీ కీడు మాత్రం జరగదన్నది వారి వాదనగా చెబుతున్నారు. తమకు పది, పన్నెండు స్ధానాలు రావడం ఖాయంగా కనిపిస్తోందనీ, మంత్రివర్గంలో కీలకమైన శాఖలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది జనసేన నాయకుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చినా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితాల అనంతరం తెలుగుదేశం, వైసీపీలు రెండూ తమకు సమానమేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత  మిత్రులు ఉండరనే నానుడికి జనసేన మినహాయింపు కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారితో అధికారాన్ని పంచుకుని ప్రజల్లోకి వెళ్లడానికి దాన్ని ఆయుధంగా మార్చుకోవాలన్నది జనసైనికుల అభిప్రాయంగా చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *