మ‌రో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

మ‌రో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

వరుస ప్రయోగాలతో ఇస్రో సంచలనం సృష్టిస్తోంది. యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా అంత‌రిక్ష ప్రయోగాల్లో స‌త్తా చాటుతోంది. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని  పెంచుతోంది.  మనదేశానికే కాకుండా ప‌క్క దేశాల అవ‌స‌రాల‌కు సైతం ఇక్కడి నుంచే ఉప‌గ్రహాల‌ను క‌క్ష్యలోకి పంపిస్తూ ప్రత్యేక‌త‌ను చాటుకుంటోంది. వాణిజ్య ప‌రంగా దేశానికి ఆదాయాన్ని తీసుకొస్తోంది. అంతటి ఘనత గల ఇస్రో మ‌రో ప్రయోగానికి సిద్ధమైంది.

పీఎస్ఎల్‌వీ సీ 42 రాకెట్ ప్రయోగం

విదేశాల‌కు చెందిన రెండు ఉప‌గ్రహాల‌ను రోద‌సీలోకి పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్‌వీ సీ 42 రాకెట్ ద్వారా ఆదివారం రాత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రిట‌న్ కు చెందిన నోవా ఎస్ఏఆర్‌-ఎస్‌, ఎస్ఎస్టీఎల్ – ఎస్‌1 ఉప‌గ్రహాల‌ను ఈరాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్ శివ‌న్‌, షార్ డైర‌క్టర్ కున్హికృష్ణ‌ లు ఈ ప్రయోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇస్రోను ఆశ్రయిస్తున్న విదేశ సంస్థలు…

అంత‌రిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు సాధిస్తూ…. దేశీయ ఉప‌గ్రహాల‌ను క‌క్ష్యలోకి పంపుతున్న ఇస్రో ఇటీవ‌ల వాణిజ్య ప‌రంగా అభివృద్ది చెందుతోంది.  పీఎస్ఎల్‌వీ రాకెట్ల ద్వారా విదేశాల‌కు చెందిన ఉప‌గ్రహాల‌ను పంపుతోంది. ఇందుకోసం ఇస్రో ఆంత్రిక్స్ కార్పొరేష‌న్ అనే సంస్ధనూ ప్రారంభించింది. ఈ సంస్ధ విదేశాలకు చెందిన అంత‌రిక్ష ప్రయోగ సంస్ధలు, శాస్ర్తవేత్తల‌తో సంప్రదించి వారి ఉప‌గ్రహాల‌ను శ్రీహ‌రికోట నుంచి పంపించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  శ్రీహరికోట నుంచి త‌క్కువ ఖ‌ర్చుతో ప్రయోగం పూర్తి అవుతుండ‌డంతో విదేశ సంస్థలు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి.  

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *