కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందా..!?

కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోందా..!?

కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందా…? కాంగ్రెస్ పార్టీ పట్ల అటు ప్రజల్లోనూ, ఇటు ప్రాంతీయ పార్టీల్లోనూ మక్కువ ఎక్కువవుతోందా..? దేశవ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే నిజమేననిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీతో చేతులు కలిపారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించేందుకు మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో జతకట్టారు. ఈ కలయికపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పరాజయం కోసమే కలిసినట్లుగా ప్రకటించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసినా కూడా మహాకూటమికి విజయం దక్కలేదు. అయినా… చంద్రబాబు నాయుడు మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలనే నిర్ణయించుకున్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ పట్ల ఆయనకున్న వ్యతిరేకతే అంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇప్నటి వరకూ జరిగిన ఐదు దశల ఎన్నికల్లో బీజేపీకి వంద స్థానాలకు మించి రావని రాహుల్ గాంధీకి వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అనుకూలత పెరుగుతోందని రాజకీయ పరిశీలకులూ అంచనా వేస్తున్నారు. దేశంలో ఇతర పార్టీలకు చెందిన వారూ కాంగ్రెస్ పార్టీ పట్ల స్నేహహస్తాన్ని చాస్తున్నట్లుగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కేసీఆరూ అదే బాట…

కాంగ్రెస్ పార్టీ అంటేనే కారాలూ, మిరియాలూ నూరే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సన్నద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. జాతీయ స్ధాయిలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానంటున్న కల్వకుంట్ల వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగలడమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకెతో కలిసి నడవాలనుకున్న కేసీఆర్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత తాము కాంగ్రెస్ పార్టీతోనే కలుస్తామని కుండబద్దలు కొట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులూ ఇదే ధోరణి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ తన ఆలోచనను మార్చుకున్నారని చెబుతున్నారు. బీజేపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసేందుకు దేశంలో అన్ని పార్టీలూ ఏకం అవుతున్న దశలో తాను కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం కల్వకుంట్ల వారిలో కలిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లోనే కాకుండా ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ సానుకూల అభిప్రాయం వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *