ఏపీలో ప్రతిపక్షంగా ఎదుగుతామంటున్న బీజేపీ

ఏపీలో ప్రతిపక్షంగా ఎదుగుతామంటున్న బీజేపీ

ఏపీలో బలపడాలన్న బీజేపీ కల నెరవేరుతుందా? సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఐతే, కేంద్రంలో అధికారంలోకి రావడంతో, ఆంధ్రా రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. ఏపీలో ఎక్కడా గెలవని బీజేపీ, రాబోయే ఎన్నికల్లో ఏకంగా అధికారానికి చేరువవుతామని చెబుతోంది. టీడీపీ స్థానంలో పాగా వేసి, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆరాటపడుతోంది. ఐతే, అధి సాధ్యమయ్యే పని కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏపీ వ్యాప్తంగా వచ్చిన ఓట్లు 2లక్షల 64వేల 303. ఒక నియోజకవర్గంలో వచ్చే ఓట్లన్నీ కూడా బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా రాకపోవడం నివ్వెరపరుస్తోంది. నోటాకు ఏపీలో 4లక్షల ఒక వేయి 969 ఓట్లు వచ్చాయి. నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయంటే ఆ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నోటాలో సగం ఓట్లు వచ్చిన బీజేపీ, ఏపీలో బలపడుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీకి ఏపీలో గడ్డు పరిస్థితి ఉందని తాజా లెక్కలు కుండబద్దలు కొడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీకి కోటి 56 లక్షల 86వేల 511 ఓట్లు వచ్చాయి. టీడీపీకి కోటి 23లక్షల 3 వేల 620 ఓట్లు వచ్చాయి. జనసేనకు 16లక్షలకు పైగా ఓట్లు రాగా, నాలుగో స్థానంలో నోటా ఉంది. ఆ తర్వాత ఐదో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి 3లక్షల పై చీలుకు ఓట్లు వచ్చాయి. ఆరోస్థానంలో ఉన్న బీజేపీకి 2లక్షలకుపైగా మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది.

ఓట్ల గణాంకాలు ఈ విధంగా ఉంటే, బీజేపీ నేతలు మాత్రం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని సవాల్ చేస్తున్నారు. ఇటీవల నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. ఐతే, వారి వ్యాపారాలను కాపాడుకునేందుకే వెళ్లారన్న టాక్ నడిచింది. అసలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీతోనే ఉన్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. నలుగురు చేరినంత మాత్రాన బీజేపీ బలపడుతుందా అని ఎద్దేవా చేస్తున్నారు. వ్యాపారులు – అలిగేషన్స్ ఉన్న వారు మాత్రమే ఆ పార్టీలోకి వెళుతున్నారని విమర్శిస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *