'నల్లబడ్డావ్ ఏంటి నాని' అని అచ్చెన్నాయుడి పరామర్శ...నాని తిరిగి సెటైర్!

'నల్లబడ్డావ్ ఏంటి నాని' అని అచ్చెన్నాయుడి పరామర్శ...నాని తిరిగి సెటైర్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నపుడు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించి అవహేళన స్థాయి వరకూ విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి..అధికారం టీడీపీ చేతుల్లోంచి వైసీపీ గుప్పిట్లోకి మారింది. దీంతో ఈసారి దురుసుతనం చూపించే అవకాశం వైసీపీ నాయకులకు దక్కింది. గురువారం మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొంచెం భిన్నమైన వాతావరణం కనబడుతోంది.

నీక్కూడా సన్నబియ్యం పంపిస్తా!

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. కొడాలి నానిని ఉద్దేశించి, ‘నల్లబడ్డావ్ ఏంటి నాని’ అని అచ్చెన్నాయుడు పలకరించారు. దీనికి సమాధానమిచ్చిన నాని..’నేను ప్రజల్లో తిరుగుతున్నాను. నీలాగా రెస్ట్‌లో లేను కదా’ అని బదులిచ్చారు. దీనికి మళ్లి అచ్చేన్నాయుడు…’చూస్తా..నువ్వు జనాలకు ఇస్తానంటున్న సన్నబియ్యం సంగతి తేలుస్తా’ అని సరదాగా అన్నారు. ‘నువ్వు ఏం తేలుస్తావ్…ప్రజలకు పౌరసరఫరాల శాఖామంత్రిగా సన్నబియ్యం ఇచ్చే తీరుతా ‘ అని సవాల్ విసిరారు.

సభలో గందరగోళం…

అక్కడితో ఆగకుండా.. కావాలంటే నీకు కూడా ఒక బస్తా సన్నబియ్యం ఇంటికి పంపిస్తాను’ అని నాని వ్యంగ్యంగా అన్నారు. ‘నాకొద్దులే కానీ నువ్వు జనాలకు పంచు చాలు. ఎలా పంచుతావో నేను కూడా దగ్గరుండి చూస్తాను’ అని అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లాబీలో ఉన్నవారందరూ ఆసక్తికరంగా విన్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నీటి ప్రాజెక్టుల మీద జరిగిన చర్చలో రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైనవిమర్శలు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు వచ్చినపుడు ఆ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో నిర్మిస్తుంటే టీడీపీ వాళ్లు గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎం జగన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గాడిద అన్న పదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటిరోజే ఇంత రసాభాస ఉంటే జులై 30 వరకు జరగనున్న సమావేశాల్లో ఇంకెంత గందరగోళం జరుగుతుందో అని విశ్లేషకు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *