పూజారా వన్ మాన్ షో!...సెంచరీతో పాటు టెస్టుల్లో 5000 పరుగులు

పూజారా వన్ మాన్ షో!...సెంచరీతో పాటు టెస్టుల్లో 5000 పరుగులు

చటేశ్వర్ పూజారా…ఈరోజు, ఈ పేరు శతక పూజారాగా మారిపోయింది. పదకొండు మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలవకుండా ఔట్ అవుతుంటే ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అందరూ కుప్పకూలారు. ఎవరూ సరైన ఆటను కనబరచలేకపోయారు. విరాట్ కొహ్లీతో సహా ఎవరూ సరిగా ఆడలేకపోయారు. ఇలాంటి సమయంలో కూడా సహనంతో ఆడాడు పూజారా…రోజంతా పట్టుదలగా ఆడిన పూజారా 246 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఇంత క్లిష్ట సమయంలో కూడా జాగ్రత్తగా వికెట్‌ను కాపాడుకుంటూ సెంచరీ సాధించాడు. జట్టు ప్రమాదకర స్థితిలోనూ సెంచరీ చేసిన పూజారా టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు.

Pujara@5000

పూజారా ద్రావిడ్…భలే కుదిరింది!

పూజారా ఆటను గమనిస్తే…రాహుల్ ద్రావిడ్ గుర్తుకువస్తాడు. చాలా జాగ్రత్తగా సహనంతో ఆడటంలో ఇద్దరూ ఒకటే…జట్టులోని సభ్యులు వెనకబడ్డపుడు వాల్ లాగా నిలబడి తమ ఆటతీరుతో జట్టుని ప్రమాదంలోంచి బయటకు తెస్తారు. అయితే ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరికీ భలే పోలికలు కుదిరాయి…ద్రావిడ్ 5000 పరుగులు పూర్తి చేయడానికి 108 ఇన్నింగ్స్ తీసుకుంటే, పూజారా కూడా తన 5000 పరుగుల మైలురాయిని 108 ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేశాడు. ఇదే కాకుండా…ఇద్దరూ 3 వేల పరుగులను 67 ఇన్నింగ్స్‌లోనూ, 4 వేల పరుగులను 84 ఇన్నింగ్స్‌లోనూ సాధించడం ఆశ్చర్యపోయే విషయం.

ఆరో బ్యాట్స్‌మెన్

పూజారా ఖాతాలో మరో అరుదైన సంఘటన కూడా జరిగింది ఇవాళ. ఆసియా వెలుపల జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్ పూజారా కావడం విశేషం. పూజారా కంటే ముందు 1952లో మంజ్రేకర్ ఈ ఘనతను సాధించాడు. సచిన్ 2001లో తొలిరోజు సెంచరీ చేశాడు. విజయ్, సెహ్వాగ్ తొలిరోజు సెంచరీలు చేయగా…కొహ్లీ ఈ ఫీట్‌ను రెండుసార్లు దక్కించుకున్నాడు.

Pujara@5000

పూజారా ఓపిగ్గా తొలిరోజు మొత్తం క్రీజులో ఉండి ఆడటంతో ఇండియా టీమ్ 250/9 స్కోర్ చేయగలిగింది. 87.4 ఓవర్ల వద్ద పూజారా రనౌట్ అవడంతో…తొలిరోజు ఆటను అంపైర్లు నిలిపేశారు. ప్రస్తుతం మహ్మద్ షమీ క్రీజులో ఉన్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *