ప్రపంచకప్‌లో భారత్‌ కథ సమాప్తం...

ప్రపంచకప్‌లో భారత్‌ కథ సమాప్తం...

లీగ్‌ దశ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి.. కప్పుపై ఎన్నో ఆశలు రేకెత్తించిన కోహ్లీసేన.. అభిమానులకు తీరని వేదన మిగులుస్తూ మరోసారి సెమీస్‌లోనే నిష్క్రమించింది. నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియా భారత్‌ ఆశలకు గండి కొడితే.. ఈసారి న్యూజిలాండ్‌ షాకిచ్చింది. వర్షం కారణంగా రెండో రోజుకు వాయిదా పడ్డ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా 18 పరుగుల తేడాతో ఓడింది.

ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటానికి తెరపడింది. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీఫైన‌ల్లో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. జడేజా, ధోనీ గొప్ప పోరాటం చేసి కీలక సమయంలో ఔట్‌ కావడంతో.. కోహ్లీసేన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆది నుంచే కష్టాలు ఎదుర్కొంది. చెప్పాలంటే.. టాప్‌ఆర్డర్‌ 5 పరుగులకే కుప్పకూలింది. ఆదుకున్నట్లే కనిపించిన పంత్‌, పాండ్య వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో అడుగంటిన ఆశలను తిరిగి రేకెత్తించిన జడేజా అవుటయ్యాక మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. ఇక సిక్సర్‌తో ధోనీ ఆశలు రేపినప్పటికీ ఆ వెంటనే రనౌట్‌ అవడంతో మ్యాచ్‌ ఫలితం తేలిపోయింది.

ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కివీస్ తమకంటే ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయం సాధించిందని కొనియాడాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యామని.., తమ ఓటమికి అదే కారణమని పేర్కొన్నాడు. లక్ష్య ఛేదనలో చతికిలపడ్డామన్న కోహ్లీ.. తొలి అరగంట ఆట మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిందన్నాడు. జడేజా అదరగొట్టే ప్రదర్శన చేశాడని ఆకాశానికెత్తేశాడు. ధోనీ మంచి భాగస్వామ్యం అందించాడని అన్నాడు. ఇక తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

న్యూజిలాండ్‌తో చివరిదాకా పోరాడిన భారత్‌ చివరకు ఓటమిపాలై ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. సెమీస్‌ మ్యాచ్‌ ఫలితం తనకు నిరాశ కలిగించిందన్న మోదీ, విజయం కోసం భారత్‌ చివరివరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని గుర్తుచేశారు. అంతేకాదు.. జీవితంలో గెలుపు, ఓటములు సహజమేనని పేర్కొన్నారు.

మొత్తానికి 120 కోట్ల మంది కన్న కల…. 120 కోట్ల మంది భావోద్వేగాల కలబోత… రన్ మెషిన కోహ్లీ’ కన్న బంగారు కల.. మరోసారి ప్రపంచకప్‌ ముద్దాడాలని దిగ్గజ ధోనీ కన్న కల.. కలగానే మిగిలిపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *