భారత్‌ జైత్రయాత్ర

భారత్‌ జైత్రయాత్ర

ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ 125 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక చెప్పాలంటే భారత్‌ బౌలర్ల ముందు విండీస్ బ్యాట్స్‌మెన్‌ నిలబడలేకపోయారు. ఇక ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయిన విండీస్ బ్యాటింగ్‌ ఆర్డర్‌.. సైకిల్‌ స్టాండ్‌ను తలపించింది. ఫలితంగా ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ నుంచి మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ నిష్క్రమించింది.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 48 పరుగులు చేయగా.. కెప్టెన్ కోహ్లీ, ధోనీలు అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. ఇక భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్యా, కుల్దీప్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 72 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 125 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కచ్చితమైన టెక్నిక్, లైన్ అండ్‌ లెంగ్త్‌తో కరీబియన్‌ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశారు. తొలుత క్రిస్‌ గేల్‌ను ఔట్‌ చేసి విండీస్‌ వికెట్ల పతనాన్ని ప్రారంభించిన టీమిండియా బౌలర్లు.. వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తడి పెంచారు. చెప్పాలంటే ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయిన విండీస్‌ జట్టు.. ఓటమి పాలైంది. విండీస్ ఆటగాళ్లో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్‌ చేసిన 31 పరుగులే అత్యధికం. నికోలస్ పూరన్ 28, హెట్‌మెయిర్‌ 18 పరుగులు చేశారు. మిగితా వారిలో ఎవరూ డబుల్‌ డిజిట్‌ దాటలేదు.

ఇక రన్‌ మెషిన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా.. సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లీ రికార్డు నమోదుచేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *