శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ శతకాలతో చెలరేగిన వేళ… లీగ్‌ దశలో శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఇక 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్.. 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నిర్ధిష్ట లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌ తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించగా.. కోహ్లీ తన బ్యాటింగ్‌ లైనప్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

చెప్పాలంటే.. శ్రీలంకపై భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో విరుచుకుపడగా.. క్లాస్ ఆటగాడు లోకేశ్ రాహుల్ కూడా సెంచరీ నమోదుచేశాడు. ఇక అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్ ఈ ప్రపంచకప్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఓ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఉన్న సంగక్కర రికార్డును బద్దలుగొట్టాడు. అంతేకాదు.. మొత్తం ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు సచిన్‌ సరసన నిలిచాడు రోహిత్‌.

మరోవైపు.. మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో విజయం సఫారీలనే వరించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఆసీస్ 2వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఆజట్టు ఈ నెల 11వ తేదీన బ‌ర్మింగ్ హామ్‌లో ఇంగ్లండ్‌తో 2వ సెమీ ఫైనల్‌లో తలపడనుంది. ఇక పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన భారత్ ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లో మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడనుంది.

ఇక లీడ్స్‌ వేదికగా భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ జరుగుతుండగా ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’ అనే నినాదం గల బ్యానర్‌తో ఒక విమానం స్టేడియం మీదుగా వెళ్లడంవివాదాస్పదంగా మారింది. ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచీ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. దీనిపై స్పందించిన ఐసీసీ ప్రతినిధి.. ప్రపంచకప్‌ టోర్నీల వద్ద ఇలాంటి రాజకీయ సందేశాల్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించబోమని తెలిపారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి తాము స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుని మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఉహాగానాల నేపథ్యంలో మిస్టర్ కూల్ కూడా స్పందించారు. క్రికెట్‌కు తాను ఎప్పుడు గుడ్‌బై చెప్తాననే విషయంలో తనకే స్పష్టత లేదన్నారు. అయితే.. వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో ఆడే ఆఖరి లీగ్ మ్యాచ్‌కు ముందే తాను రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు కోరుకుంటున్నారని ధోనీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జట్టు ఆటగాళ్లను కానీ, యాజమాన్యాన్ని కానీ నిందించడం లేదని మిస్టర్ కూల్ స్పష్టం చేశారు.

మొత్తానికి లక్ష్యఛేదనలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి జట్టు శ్రీలంకకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ల ఆటనే హైలెట్‌గా నిలిచింది. లంక బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. రాహుల్‌ ఆచితూచి ఆడగా.. రోహిత్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *