బలాలే బలహీనతలు కూడా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్ మ్యాచ్!

బలాలే బలహీనతలు కూడా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వరల్డ్‌కప్ మ్యాచ్!

ప్రపంచకప్‌ అసలుసిసలు సమరానికి రెడీ అయ్యింది. టోర్నీలో అపజమయే ఎరుగని టీమిండియాతో.. ఫేవరెట్ హోం టీం ఇంగ్లండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సెమీస్‌ రేస్‌లో నిలవాలనే కసితో మోర్గాన్ సేన బరిలోకి దిగుతుంది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాలుగో స్థానం భర్తీ చేసేదెవరు!
ప్రపంచకప్‌లో అజేయ రికార్డుతో కొనసాగుతున్న కోహ్లీ సేన.. ఇంగ్లండ్‌ రూపంలో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. బర్మింగ్‌ హామ్ వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి రెండు టఫ్ టీమ్స్‌ రెడీ అయ్యాయి. 11 పాయింట్లతో టాప్ 2 ప్లేస్‌లో కొనసాగుతున్న టీమిండియా చావోరేవో తేల్చుకోడానికి మోర్గాన్ సేనతో తలపడనుంది. అయితే.. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ రేస్‌లో నిలిచేది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్‌ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ భారత్‌ ఫిట్‌నెస్‌ శక్తిసామర్థ్యాలకు పరీక్షగా నిలువనుంది. ఇప్పటికే ఆటగాళ్ల గాయాలు జట్టుకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఏకంగా టోర్నీ నుంచే నిష్ర్కమించాడు. ఇక ధావన్ స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా వెళ్లడం నాల్గవ స్థానంలో వచ్చిన విజయ్‌శంకర్ అంచనాల్ని అందుకోకపోవడం టీమిండియాను కంగారుపెడుతోంది. దీంతో ప్రపంచకప్‌కు ముందు సమస్యగా ఉన్న నాల్గవ స్థానంపై చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ స్థానంలో దిగుతున్న విజయ్‌శంకర్‌ ప్రదర్శన స్థాయికి తగ్గట్టుగా లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. బౌలింగ్‌లోనూ పనికొస్తాడనుకున్న శంకర్‌కు గత రెండు మ్యూచుల్లోనూ ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు.

బౌలింగ్ బలం…
చెప్పాలంటే ఈ మ్యాచులోనూ బ్యాటింగ్‌ భారం మరోసారి రోహిత్, కోహ్లీలపైనే పడనుంది. అయితే.. రోహిత్ గత రెండు మ్యాచుల్లో అంతగా ఆకట్టులేకపోయాడు. ఇక కోహ్లీ ఫుల్‌ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో ధోని, జాధవ్ మరోసారి సత్తా చాటాలి. ఆఖరిలో మెరుపులు మెరిపించడానికి హార్దిక్ పాండ్యా ఎలాగో ఉన్నాడు. అయితే.. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ నుంచి ప్రత్యర్థులకు ప్రధాన ముప్పు బౌలర్ల నుంచే అని విశ్లేషకులు ఎందుకన్నారో రుజువు చేసింది బౌలింగ్ దళం. టీమిండియా బ్యాట్స్‌మెన్ దళం తడబడుతుంటే.. బౌలర్లు విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు చూస్తే.. ఇంగ్లండ్‌ పిచ్‌లు పొడిబారుతున్నాయి. దీంతో స్పిన్ ద్వయం కుల్దీప్, చాహెల్ కీలకం కానున్నారు. వీరిద్దరూ చెలరేగితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు.

సమ ఉజ్జీలు!
ఇక భారీ అంచనాలతో ప్రపంచకప్‌కు వేట మొదలు పెట్టిన ఇంగ్లండ్‌ ఒత్తిడిని జయించలేదు. ప్రపంచకప్‌కు ముందు భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించి అంచనాలు ఆకాశాలు తాకేందుకు మోర్గాన్ సేన అవకాశం కల్పించింది. కానీ ప్రపంచకప్‌లో చిన్నపాటి ఛేదనలో చిత్తుగా ఓడింది. శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతిలో వరుస ఓటములు ఇంగ్లండ్‌ను మానసికంగా కుంగదీసాయి. ఇంగ్లీషు ఆటగాళ్లలో ఆ మార్పు స్పష్టంగా కనబడుతోంది. చివరి రెండు మ్యాచులు వరుసగా భారత్, న్యూజిలాండ్ లను ఎదుర్కోవాల్సి రావడం ఆతిథ్య జట్టుకు మరింత ఇబ్బందికరం. బర్మింగ్‌ హామ్‌లో భారత్‌ చేతిలో ఓడితే మరోసారి ఆతిధ్య జట్టుగా ఇంగ్లండ్‌కు భంగపాటు తప్పదు. కాగితంపై కోహ్లీ సేనను ధీటుగా ఎదుర్కోగల ఇంగ్లండ్‌ మైదానంలో ఒత్తిడిని జయిస్తేనే అసలు పోటీ ఇవ్వగలదు. మొత్తానికి ఇంగ్లండ్‌… బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తోంది. ఆ జట్టులో ఫాస్ట్ బౌలర్స్ సత్తా చాటుతున్నారు. స్పినర్లు సైతం ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇంగ్లీష్ టీం బౌలింగ్‌తో భారత్‌కు సవాల్‌ విసరనుంది. వరల్డ్‌కప్‌లో.. టీమిండియా, ఇంగ్లండ్ ఏడుసార్లు తలపడగా.., రెండు జట్లు చెరో మూడు విజయాలతో సమఉజ్జీలుగా ఉన్నారు. ఒక మ్యాచ్‌ మాత్రం టై అయ్యింది. ఇరు జట్లతో టఫ్ క్లాస్ ఫేయర్స్ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదంటున్నారు క్రికెట్‌ పండితులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *