పాకిస్థాన్ సెమీస్ చేరొద్దంటే..బంగ్లాదేశ్ టాస్ గెలిస్తే చాలు..

పాకిస్థాన్ సెమీస్ చేరొద్దంటే..బంగ్లాదేశ్ టాస్ గెలిస్తే చాలు..

లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుతుండటంతో.. సెమీస్‌లోని నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రపంచకప్‌లో పాల్గొన్న పది జట్లలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌,శ్రీలంక లు అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం.. న్యూజిలాండ్‌, పాక్‌ పోటీ పడుతున్నాయి.. మరి ఈ రెండు టీమ్‌లలో ఎవరికి అవకాశం దక్కనుంది?

వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ చేరగా.. న్యూజిలాండ్‌పై గెలిచిన ఇంగ్లాండ్ కూడా నాకౌట్ దశకు చేరింది. ఇక సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. కివీస్ ఖాతాలో 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 11 పాయింట్లు ఉండగా.. పాకిస్థాన్ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై గెలిస్తే పాక్ ఖాతాలోనూ 11 పాయింట్లు చేరతాయి. కానీ నెట్ రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ ఎంతో మెరుగ్గా ఉండటం.. పాకిస్థాన్‌కు మైనస్ కానుంది. నెట్ రన్‌రేట్ అంతరంతో కివీస్ జట్టు సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. కానీ టెక్నికల్‌గా చూస్తే ఇప్పటికీ పాకిస్థాన్‌కు కూడా సెమీస్ చేరే అవకాశం ఉంది.

శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది. ఎంత భారీ విజయం అంటే.. పాక్ 350 పరుగులు చేస్తే.. బంగ్లాను 311 రన్స్ తేడాతో ఓడించాలి. 400 పరుగులు చేస్తే 316 రన్స్ తేడాతో, 450 పరుగులు చేస్తే 321 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించాలి. క్రికెట్ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో పాక్ విజయం సాధించాలి.

అయితే పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తేనే. ఒకవేళ.. బంగ్లాదేశ్ గనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే పాక్ సెమీస్ ఆశలు గల్లంతే. ఒక్క బంతి కూడా పడకుండానే పాకిస్థాన్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. అంటే పాకిస్థాన్ సెమీస్ చేరొద్దంటే.. బంగ్లాదేశ్ తీవ్రంగా పోరాడాల్సిన అవసరం లేదు.. జస్ట్ టాస్ గెలిస్తే చాలన్న మాట. పాక్‌‌పై ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం బంగ్లాదేశ్ ముందుంది. ఒక వేళ ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలిచినా.. అది కంటి తుడుపు మాత్రమే కానుంది.

మొత్తానికి ప్రస్తుత వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆటను 1992 వరల్డ్ కప్‌తో పోలుస్తూ.. ఇంతకాలం సంబరపడిన పాక్ ఫ్యాన్స్‌ ఇక సైలెంట్ అయిపోవాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *