టీవీ ఛానెళ్ల పై కేంద్రం కొరడా

టీవీ ఛానెళ్ల పై కేంద్రం కొరడా

ఇంటిల్లిపాది కలిసి వీక్షించే టీవీ చాన‌ల్ల విష‌యంలో కేంద్ర ప్రభుత్వం క‌ఠిన నిర్ణయం తీసుకుంది. టీవీ ఛాన‌ల్ల శృతి మించిన చ‌ర్యల‌కు బ్రేకులు వేసేలా కొర‌డా ఝులిపించింది. గత కొన్నేళ్లుగా టీవీ చానెళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోవ‌డం.. అందులో కొన్ని ప్రోగ్రామ్స్ శృతి మించి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గ దర్శకాలను జారీ చేసింది. కాగా.. ఈ నిబంధ‌న‌ల‌ను అంతటా పాటించాల‌ని, పిల్లల‌ను అనుచితంగా చూపించే చ‌ర్యల‌కు బ్రేకులు వేయాల‌ని ప‌లువురు ఆకాంక్షిస్తున్నారు.

ఇక రియాల్టీ షోల‌లో పిల్లలు, పెద్దవాళ్లు చేసే డాన్సులను పొట్టి పొట్టి డ్రెస్సులతో అసభ్యంగా చూపిస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇలా కొన్ని షోలలో పిల్లలను చూపిస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. పిల్లల ప్రోగ్రాముల్లో ఎటువంటి హానికరమైన భాష కానీ, హింసాత్మకమైన సన్నివేశాలను చూపించరాదని పేర్కొంది. కేబుల్ చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు ఛానళ్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపింది.

అయితే.. రియాల్టీ షోలు స‌హా ఇత‌ర ప్రోగ్రామ్‌ల‌లో పెద్దలు వేసే స్టెప్పులు పిల్లలతో చేయించే ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల‌ మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ రియాల్టీ షోలలో పిల్లలను అనుచితంగా చూపించడంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ చానల్స్‌కు కొన్ని ప్రత్యేక‌ మార్గ దర్శకాలను జారీ చేసింది. మొత్తానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ మార్గదర్శకాలపై వివిధ బాలల హక్కుల సంఘం వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *