వాయుసేన అమ్ములపొదిలోకి 'అపాచీ'

వాయుసేన అమ్ములపొదిలోకి 'అపాచీ'

భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. తొలి అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ను అమెరికా అధికారికంగా భారత వైమానికదళానికి అప్పగించింది.

భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. తొలి అపాచీ అటాక్ విమానం భారత వాయుసేనలో చేరింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది.అరిజోనాలోని బోయింగ్‌ ఉత్పత్తి కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారత వైమానిక దళం తరఫున ఎయిర్‌ మార్షల్‌ ఏఎస్‌ బుటోలా తొలి అపాచీని స్వీకరించారు. యూఎస్‌ నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబరులో ఐఏఎఫ్‌.. అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి తొలి విడత హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు రావడం ఐఏఎఫ్‌ హెలికాప్టర్ల ఆధునికీకరణలో కీలక ముందడుగు. వాయుసేన భవిష్యత్‌ అవసరాలకు ఈ హెలికాప్టర్‌ ఎంతో అనువైనది. అపాచీ హెలికాప్టర్లకు గాలిలో, భూమి మీద దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లుగా అపాచీకి పేరుంది.

పలు రకాల విధులు ఒకేసారి నిర్వర్తించడంతోపాటు శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేయడంలో ఇవి దిట్ట . ఈ హెలికాప్టర్‌లో ఏర్పాటుచేసిన రాడార్ల సాయంతో ఇది రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోరాటం చేయగల సామర్థ్యం వీటి సొంతం. అంతేకాదు. 12 వేల తూటాలతో వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. గగనతలం నుంచి గగనతలంలోని ప్రయోగించే క్షిపణులనూ మోసుకెళ్లగల సామర్థ్యం వీటి సొత్తు. 60 సెకన్లలోపే 128 లక్షాలను విశ్లేషించడంతోపాటు శత్రువుల దాడి నుంచి శరవేగంగా, తేలిగ్గా తప్పించుకోగలవు. ఇవి గంటకు గరిష్ఠంగా 284 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *