డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే మీ లైసెన్స్, పాస్ పోర్ట్, వీసాలు రద్దు..!

డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే మీ లైసెన్స్, పాస్ పోర్ట్, వీసాలు రద్దు..!

ఇక మీదట తాగి వాహనం నడపాలంటే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యం మత్తులో వాహనం నడిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు నగర పోలీసులు. డ్రంకన్‌ డ్రైవ్‌ లో భాగంగా ఒక్క జూన్‌ నెలలోనే మందుబాబుల నుంచి 54 లక్షల 94 వేల రుపాయల ఫైన్లను వసూలు చేశారు పోలీసులు. అంతేకాదు.. కోర్టు తీర్పుతో ఎంతో మంది జైలు పాలయ్యారు.

తాగి బండి నడపొద్దు అని పోలీసులు ఎంత మొత్తుకున్నా తాగేవాళ్లు తాగుతూనే ఉన్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో దొరుకుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో గత నెల జూన్‌లో చేసిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దాదాపు 2 వేల 536 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో చాలామందికి జరిమానా విధించగా, ఫుల్లు కిక్కు మీదున్న 340 మంది మందుబాబులకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఒక రోజు నుంచి 30 రోజుల వరకు జైలు శిక్షను విధించింది.

ఇక డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో నుండి 121 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా, తాత్కలికంగా రద్దుచేయాలని ట్రాఫిక్‌ పోలీసులు ఆర్‌టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఇందులో ఒక వ్యక్తి లైసెన్స్‌ను సుమారు 10 ఏళ్ల పాటూ రద్దు చేయగా, మరికొంత మంది లైసెన్స్‌లను 7 సంవత్సరాల పాటూ రద్దు చేశారు. చెప్పాలంటే పట్టుబడుతున్న వారిలో మహిళల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

ముఖ్యంగా యూత్‌కు ఈ డ్రంకన్‌ డ్రైవ్‌తో చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వారిపై కేసు నమోదు అవుతుంది. ఫలితంగా ఆ కేసు ద్వారా భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వూల సమయంలో పోలీసు కేసు ఉంటే వారికి ఉద్యోగ అవకాశం కష్టమవుతుంది. వీటితో పాటూ పాస్‌ పోర్ట్, వీసా ప్రాసెస్‌ సమయాల్లోనూ ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని యూత్‌ను హెచ్చిరిస్తున్నారు పోలీసులు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని తాగి వాహనం నడపకుండా జాగ్రత్త పడండి అని అంటోంది పోలీసు శాఖ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *