నాలుగు ఓట్లు ఉంటే.. ఇంటికో కలర్‌ టీవీ

నాలుగు ఓట్లు ఉంటే.. ఇంటికో కలర్‌ టీవీ

ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను మెప్పించే పనిలో పడ్డారు నేతలు. చివరి నిమిషంలో వీలైనంత మందికి వలవేసేందుకు సిద్ధమయ్యారు. ఓటుకు నోటు మాత్రమే కాదు.. మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ పంచితే.. వారికే విజయావకాశాలు అనే లెక్కన పంపిణీ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ఓటర్లకు గాలం వేస్తున్నారు.

ఓటర్లను మెప్పించే పనిలో నేతలు

కొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. గుట్టలకు గుట్టలు నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌, ఐటీ అధికారుల కళ్లుగప్పి ఓటర్లకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, దాన్యం విక్రయాల్లో పెద్ద మొత్తంలో నగదును చూపిస్తున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లను దొడ్డిదారిన తరలిస్తున్నారు.

ఏరులైన పారుతున్న మద్యం

కొందరు డబ్బులు పంపిణీ చేస్తే మరికొందరు… ఆభరణాలు పంపిణీ చేస్తున్నారు. చెవి కమ్మలు, వెండి వస్తువులు పంపిణీచేస్తున్నారు. మరికొందరు చీరలు పంచిపెడుతున్నారు. ఒక్కో ఇంట్లో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి వస్తువులను ఎంపికచేసి అందజేస్తున్నారు. ఓటుకు వెయ్యి నుంచి పది వేల వరకు ఇస్తున్నారు. ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే.. ఏకంగా ఇంటికి కలర్‌ టీవీనే పంపిస్తున్నారు. మరికొందరైతే… నేరుగా అకౌంట్‌లోనే డబ్బులు వేసేస్తున్నారు.

పట్టుబడ్డ 125 కోట్ల రూపాయలు

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో దాదాపు 125 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. 4లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినా… దొడ్డిదారిన ఓటర్ల చెంతకు మద్యం, మనీ చేరుతూనే ఉంది. మరోవైపు పోస్టల్‌ బ్యాలెట్‌పై కూడా నేతలు కన్నేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయుల ఓట్లను కొనుగోలు చేసే పనిలో పడ్డాయి పార్టీలు.

మొత్తానికి.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగుతారా? తాయిళాలతో ఓటరును ప్రభావితం చేయగలరా? తెలుసుకోవాలంటే.. ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *