ఏపీలో జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని?

ఏపీలో జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని?

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ, గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది.లెక్కలు తీస్తే ఎన్ని వస్తాయో తెలవదు గానీ,ప్రధాన పార్టీలకు మాత్రం కాసింత చిక్కులే తెచ్చిపెడుతున్నాయట.పలు చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అంచనాలతో..అక్కడి పరిస్థితులు తలకిందులైపోతున్నాయట.

అధికారం తమదంటే తమదేనంటూ టీడీపీ,వైసీపీలు హోరెత్తిస్తుండగా…తాము సైతం ప్రభావితం చేయగలమంటోంది జనసేన.ఏపీలో జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతోంది ?ఎన్ని సీట్లలో ఫలితాలను తారుమారు చేయబోతోంది? అన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమేరకు ఉండబోతుంది అన్నదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.కానీ,ప్రధాన పార్టీలైన టీడీపీ,వైసీపీ వర్గాలు మాత్రం జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని చెబుతున్నాయి.జనసేన వర్గాలు మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నారు.అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక,భీమవరం స్ధానాలతో పాటు విశాఖ జిల్లాలోని పెందుర్తి,యలమంచిలి, గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు తమవే అంటున్నారు జనసేన నేతలు.వీటితో పాటు పెడన,విజయవాడ వెస్ట్,గుంటూరు వెస్ట్,తెనాలి,తిరుపతి,నంద్యాలలో జనసేన విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక ఎంపీ విషయానికొస్తే విశాఖ తమ ఖాతాలో పడటం ఖాయమనేది జనసేన వర్గాల అంచనాగా ఉంది.విశాఖలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అంచనాలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు.జనసేనతో పాటు ఇతర పార్టీల్లోని సానుభూతిపరులు లక్ష్మీనారాయణ వైపు మొగ్గుచూపారని అంచనా.నంద్యాలలో ఎస్పీవై రెడ్డిపైనా జనసేన ఆశలు పెట్టుకుంది.నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఎస్పీవైరెడ్డి కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో దిగారు.నరసాపురంలో పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తోడు,సొంత జిల్లా కావడంతో గెలుపుపై నాగబాబు ఆశలు పెట్టుకున్నారు.జనసేన లెక్కలు ఇలా ఉంటే,ఈ స్థానాల్లో ఓట్లు చీలి తమకు ఎక్కడ మైనస్ అవుతుందోనన్న ఆందోళన టీడీపీ,వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది.

తాజా ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే ప్రధాన పార్టీలపై జనసేన ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.కోస్తాంధ్ర,రాయలసీమలో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో జనసేన ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది.అదే జరిగితే ఆయా స్ధానాల్లో నష్టపోయే పార్టీలు ఏవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతునిచ్చిన జనసేన..ఈసారి సొంతంగా బరిలోకి దిగడం వల్ల ఆ పార్టీ ఓట్లకు గండికొడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది.వైసీపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న మైనార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోంది.అసెంబ్లీ స్థానాల్లో కన్నా,లోక్‌సభ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *