ఒడిశాలో బీజేడీని ఓడించేందుకు బీజేపీ వ్యూహమేంటి?

ఒడిశాలో బీజేడీని ఓడించేందుకు బీజేపీ వ్యూహమేంటి?

ఇద్దరూ ఇద్దరే.జాతీయ స్థాయిలో ఎవరి గుర్తింపు వారికుంది.ప్రధాని హోదాలో మోదీ,సీఎం హోదాలో నవీన్‌ ఒడిశా బరిలో ఢీకొంటున్నారు.నవీన్ ఇమేజ్‌పైనే మరోసారి ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకోగా,మోదీ మేజిక్ చేస్తారని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు.నవీన్ కోటలో మోదీ మంత్రం పనిచేస్తుందా..?ఈసారి ప్రజా తీర్పు ఎటు ఉండబోతోంది?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒడిశా పాలిటిక్స్ మరింతగా హీటెక్కుతున్నాయి.బీజేడీతో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది.రెండు దశాబ్దాలుగా కేంద్రంలో,మిగతా రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు జరిగాయి.కానీ,ఒడిశాలో మాత్రం బిజూ జనతాదళ్‌కు ఎదురులేదు.2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అలాంటి బీజేడీకి ఈసారి గట్టి పోటీనిస్తామంటోంది బీజేపీ.అవినీతి రహిత పరిపాలనే ఒడిశా సీఎం జెండా,ఎజెండా కూడా.అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది.ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది.కానీ,నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి తమ దారి మార్చుకుంటారన్న టాక్ వినిపిస్తోంది.రాష్ట్రంలో నవీన్‌పై నమ్మకం చెక్కు చెదరకపోయినా ఆయన చుట్టూ ఉండే వారిపై అసమ్మతి రాజుకుంటోంది.ముఠా పోరు తారస్థాయికి చేరుకుంది.అవినీతి అధికారులు,నేతలపై నవీన్‌ పట్నాయక్‌ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తోడు పార్టీలో అసమ్మతి సెగలు కక్కుతున్నాయి.ఇదే అదునుగా బీజేపీ పావులు కదుపుతోంది.చేరికలతో బలాన్ని పెంచుకుంటూనే,బీజేడీ నేతలు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది.

2000,2004లో వరుసగా రెండు సార్లు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్‌ పట్నాయక్‌,2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పార్టీని గెలుపించుకున్నారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హవాలోనూ,ఒడిశాలో బిజూ జనతా దళ్‌ తట్టుకొని నిలబడింది.రాష్ట్రంలో 21 లోక్‌సభ సీట్లకుగాను 20 సీట్లలో బీజేడీ గెలుపొందింది.అదే సమయంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 147 స్థానాలకుగాను 117 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో నవీన్ పట్నాయక్ ఉన్నారు. హింజిలీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఆది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ పట్నాయక్‌,ఈసారి హింజలితో పాటు బీజాపూర్‌లోనూ పోటీ చేస్తున్నారు. హింజలిలో ఓటమి భయంతోనే పట్నాయక్‌ బీజాపూర్‌కు వెళ్లారని కమలనాథులు ఎద్దేవా చేస్తుండగా,రాష్ట్రంలో మరింత బలపడేందుకేనని బీజేడీ బదులిస్తోంది.

బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచే,లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా ఒడిశా,పశ్చిమబెంగాల్,ఈశాన్య రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది.బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పలుమార్లు ఒడిశాలో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో మా బూత్‌ పటిష్టం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.2017లో జరిగిన స్థానిక ఎన్నికల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపించింది.బీజేపీ 296 పంచాయతీ స్థానాలను గెలుచుకుంది. ముఖ్యంగా పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బీజేపీ పట్టు బాగా పెంచుకుంది. ఇక దీనికి తోడు బీజేడీ నుంచి వలస వచ్చిన నేతలతో బలపడినట్లుగా కమలనాథులు భావిస్తున్నారు.గత ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌కు తిరుగులేని విజయాన్ని అందించిన..బలభద్ర మాఝీ,బైజయంత్‌ లతో పాటు బీజేడీలో టికెట్‌ రాని పలువురు ఎంపీలు బీజేపీలోకి క్యూ కట్టారు.ఈ ఫిరాయింపులతో కమలం పార్టీ ప్రాంతీయ పార్టీని ఢీకొనే శక్తిగా ఎదిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.అటు సీఎం నవీన్ పట్నాయక్‌ కూడా బీజేపీలోని అసంతృప్తు నేతలను తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు.

నవీన్‌ పట్నాయక్‌పై ప్రజల్లో ఇమేజ్‌ చెక్కుచెదరనప్పటికీ….పార్టీ ఎంపీ,ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో,చాలా మంది సిటింగ్‌లకు సీట్లు నిరాకరించారు.నవీన్‌ పట్నాయక్‌ టికెట్లు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది కొత్త ముఖాలే ఉన్నారు. ఒడిశాలో ఏకకాలంలో అసెంబ్లీకి,లోక్‌సభకు ఎన్నికలు జరుగుతుండటంతో…బిజూ జనతాదళ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం ఎక్కువగా కనిపిస్తోంది.ఇక,ఒడిశాలో ఒకప్పుడు బాగా పట్టు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది.మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ పథకంపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. బిజు జనతాదళ్,బీజేపీపై నమ్మకం కోల్పోయిన అన్నదాతలు తమ పార్టీ వెంట నడుస్తారన్న ఆశలో రాహుల్‌ ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *