అట్టుడుకుతున్న హాంకాంగ్

అట్టుడుకుతున్న హాంకాంగ్

చైనా అధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల నిరసనలతో దద్దరిల్లుతోంది. మూడువారాలుగా శాంతియుతంగా జరుగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది. ఇంతకాలం నిరసనలకు పరిమితమైన ఆందోళనకారులు తాజాగా పార్లమెంటుపై దాడికి దిగారు.

హాంకాంగ్ అట్టుడుకుతోంది. చైనా ఆధిపత్యాన్ని నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా పెత్తనం వద్దంటూ నిరసనలకు దిగారు. హింసను సృష్టించారు. 1997 జులై 1న బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన హాంకాంగ్ చైనా పాలనలోకి వెళ్లింది. ఇందుకు గుర్తుగా ప్రభుత్వం ఏటా చైనా హ్యాండోవర్ డే నిర్వహిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది హాంకాంగ్‌వాసులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. పార్లమెంటు బిల్డింగ్‌ను చుట్టుముట్టారు.

చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అధ్యక్షుడి రాజీనామాకు పట్టుబట్టారు. కొందరు నిరసనకారులు పార్లమెంటు బిల్డింగ్‌లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. గోడలపై ఉన్న హాంకాంగ్ నేతల ఫొటోలు, ఫర్నీచర్, కిటీకీ అద్దాలు ధ్వంసం చేశారు. బ్రిటీష్ వలస పాలననాటి జెండా ఎగురవేశారు. బిల్డింగ్ గోడలపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

హాంకాంగ్‌లో ఒక దేశం రెండు వ్యవస్థల విధానం అమలవుతోంది. 1997లో కుదిరిన ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్ చైనాలో విలీనం కాదు. అయితే ఒప్పందాన్ని తుంగలో తొక్కి హాంకాంగ్‌‌ను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల హాంకాంగ్ ప్రభుత్వం తెచ్చిన నేరస్థుల అప్పగింత చట్టం వివాదాస్పదమైంది. ఈ చట్టం ప్రకారం నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి లేకుండా చైనాకు అప్పజెప్పే నిబంధనలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఇది తమ స్వేచ్ఛను హరిస్తోందని, చట్టాన్ని అడ్డుపెట్టుకుని చైనా నేతలు తమను చిత్రహింసలు పెడతారని హాంకాంగ్‌వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

మున్ముందు హాంకాంగ్‌లో నిరసనలు ఎలాంటి హింసాత్మక ఘటనలుగా మారుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *