ఫలితాల్లో జరిగిన తప్పులపై హైకోర్టు సీరియస్

ఫలితాల్లో జరిగిన తప్పులపై హైకోర్టు సీరియస్

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన తప్పుల తడకపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది. విద్యార్థులకు ఎప్పటిలోగా న్యాయం చేస్తారని ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

high court

ఇంటర్ మార్కుల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల తమ వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ ఫెయిల్ అయిన విద్యార్ధుల పేపర్లు రీ వ్యాల్యూష్ చేయాలని కోరింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని ప్రతివాది తరఫున పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనను వినిపించారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోను ఆయన సమర్పించారు.

మరోవైపు విచారణ సందర్భంగా ఇంటర్ బోర్డు వ్యవహార సరళిపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల భవిష్యత్తు కు సంబంధించిన కాబట్టి … రీ వాల్యుయేషన్ పై నిర్ణయం తెలపాలని ఇంటర్ బోర్డును హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది. దీనికి అదనపు ఏజీ సమాధానమిస్తూ రీవాల్యుయేషన్ పై సోమవారం వివరాలు వెల్లడిస్తామని ఈ మార్కుల వ్యవహారం పరిష్కారానికి 2 నెలల సమయం కావాలని కోరారు.

ఇక ఇంటర్ ఫలితాల్లో 3 లక్షల మంది వరకు ఎలా ఫెయిల్ అవుతారని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్ మేరకు రీ వాల్యుయేషన్ పై బోర్డు నిర్ణయం తెలుపాలని హైకోర్టు కోరింది. విద్యార్థుల పునర్ మూల్యంకనం కోసం ఎంత సమయం పడుతోందని ప్రశ్నించింది. మొత్తం విద్యార్థుల ఫలితాలు వెల్లడించేందుకు నెలరోజుల సమయం పడితే .. 3 లక్షల మంది విద్యార్థుల రీ వాల్యుయేషన్ కు రెండు నెలలు ఎలా పడుతుందని నిలదీసింది.ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ విచారణతో విద్యార్థులకు న్యాయం జరగదని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు ఏడాది నష్టపోకుండా .. చేపట్టే చర్యలను వివరించాలని ఇంటర్ బోర్డును కోరింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *