ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

ప్రతీ ఏడాది నైరుతీ రుతుపవనాలు రాగానే ముంబై వణికిపోతుంది. దీంతో ఈసారీ అదే జరిగింది. ముంబైని వర్షాలు ముంచెత్తాయి. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ సమస్యతో సతమతమయ్యే జనాలు.. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రుతుపవనాల రాకతో ఈ ఏడాది దేశంలోనే మొదటిసారి భారీవర్షం ముంబై నగరంలో కురిసింది. దీంతో ముంబైలోని విరార్, జుహు, ములంద్‌ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తుండగా.. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జల దిగ్బంధంలో ఆపసోపాలు పడుతున్నారు.

ఇక ముంబైలో కురుస్తున్న కుండపోత వానలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బస్సులు తిరగడం అంతంతమాత్రమేకాగ.. వాటిని కూడా అధికారులు దారి మళ్లించారు. చెప్పాలంటే పట్టాలపైకి వర్షపు నీళ్లు చేరడంతో రైల్వే వ్యవస్థ కూడా స్తంభించింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు.. భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలో వరద నీటితో పాటు మట్టి వచ్చి చేరుతోంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.

ముఖ్యంగా ముంబైలోని థానే, పరేల్, ధరావితో పాటు కింగ్స్‌ సర్కిల్, మాతుంగా, దివా ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. వరద పోటెత్తిన నేపథ్యంలో ప్రజలు మ్యాన్‌ హోళ్లను తెరవరాదని బృహన్ ముంబై అధికారులు కోరారు. మరోవైపు.. వరద పీడిత ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.

మొత్తానికి ముంబై మహానగరాన్ని వరుణ గండం వెంటాడుతోంది. నగరంపై పగబట్టినట్లుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. అయితే.. వరదనీరు ముంబైను ముంచెత్తిన నేపథ్యంలో తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *