హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. సోమవారం అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, బేగంబజార్‌, హిమాయత్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

జూబ్లీహిల్స్ లో 6.6 సెంటీమీటర్లు, కూకట్ పల్లిలో 5.7 సెంట్లీమీటర్లు, శేరిలింగంపల్లిలో 4.4 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 2.5 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 1.9 సెంటీ మీటర్లు, ఆసిఫ్‌ నగర్ లో 1 సెంటీ మీటర్ వర్షం కురిసింది. యూసఫ్‌గూడలోని శ్రీకృష్ణానగర్‌ పరిధిలో పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు పోటెత్తడంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. మోటార్ల ద్వారా నీటిని తోడేశారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక కాలినడకన వెల్లే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఎక్కడ మ్యాన్‌ హోల్ తెరిచి ఉంటుందోనని భయంతో ప్రతి అడుగు బిక్కుబిక్కుమంటు వెయాల్సివచ్చింది. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నగరవాసులు మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. హైటెక్ సిటీ నుంచి వెళ్లే మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి.

కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్‌లో రోడ్డన్నీ జలమయమవ్వడంతో నానా ఇక్కట్లు పడుతున్న జనం మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. వర్షకాల ప్రారంభం ముందు ప్రభుత్వం, అధికారులు డ్రైనేజీ సమస్యలు తీరుస్తామని చెప్పడం ఆ తరువాత సమస్యలను గాలికొదిలేయడం ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వేడుకుంటున్నారు హైదరబాదీలు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *