హైద్రాబాద్‌ ను ముంచిన వర్షం

హైద్రాబాద్‌ ను ముంచిన వర్షం

రుతుపవనాలు తెలుగు నేలను తాకాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో… హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇంకేముంది… డ్రైనేజ్‌లు పొంగి పొర్లాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. వానాకాలం కష్టాల నుంచి బయటపడేయాలంటున్నారు.

హైదరాబాద్‌పై నైరుతి రుతుపవానాల ప్రభావం పడింది. శుక్రవారం పాతబస్తీతోపాటు, అమీర్‌పేట, పంజాగుట్ట, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, తార్నాక తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నగరవాసులు మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. హైటెక్ సిటీ నుంచి వెళ్లే మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి.

ఇప్పటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్‌లో రోడ్డన్నీ జలమయమవ్వడంతో నానా ఇక్కట్లు పడుతున్న జనం మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *