అందుకేనా హరీష్ ను పక్కన పెట్టింది..!

అందుకేనా హరీష్ ను పక్కన పెట్టింది..!

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, ప్రాధాన్యత తగ్గుతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మేనల్లుడు, సీనియర్ నాయకుడైన హరీష్ రావును పక్కన పెట్టారు. తెలంగాణ శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికల ప్రచారసభల్లో హరీష్‌రావు పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావును పట్టించుకోలేదు. కేసీఆర్ తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదివి కట్టబెట్టారు. ఆ సమయంలోనే హరీష్ రావును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి.

కీలక ఘట్టం ఉందా…

తాజాగా లోక్‌సభ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా మంత్రులు, సీనియర్ నాయకులు కలపి 20 మందిని నియమించారు. వీరిలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్‌తో పాటు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితకూ స్థానం కల్పించారు. ఈ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ రావు మాత్రం లేరు. ఇప్పటికే మంత్రి పదవికి దూరం చేసి పార్టీలో ప్రాధాన్యత తగ్గించిన కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా హరీష్ రావును నియమించకపోవడం వెనుక కీలక ఘట్టం ఒకటి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు…

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ తర్వాత హరీష్ రావు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ “నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. మా నాయకుడు కేసీఆర్ ఎలా ఆదేశిస్తే నేను అల నడుచుకుంటాను” అని ప్రకటించారు. అయితే తన వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలను హరీష్ రావు నిరంతరం ఫోనులో సంప్రదిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. అదే విధంగా ఈ మధ్య అదిలాబాద్ జిల్లాలో తన వర్గం అని చెప్పుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలతో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేసారని కూడా పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెదక్ లోక్‌సభ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేసిన సందర్భంగా హరీష్ రావు అంటీఅంటనట్టుగా వ్యవహరించారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలతో హరీష్ రావు ఫోన్లో సంప్రదింపులు చేయడం, రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకపోవడం వంటి అంశాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సీరియస్‌గా తీసుకున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ రావు పేరు లేదని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *