లక్షకు పైగా ఏటీఎంలు బంద్ కాబోతున్నాయా?

లక్షకు పైగా ఏటీఎంలు బంద్ కాబోతున్నాయా?

గతంలో నగదు కావాలంటే ఏటీఎంకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలలో నగదుని ఉంచడమే గగనం అయిపోయింది. ఉన్న కొన్ని ఏటీఎంలూ…ఒక్కోసారి పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ప్రజల జీవితాలపై చాలా ప్రభావం చూపించింది. ఇపుడు ఇంకోసారి నగదు కష్టాలతో ఇబ్బంది పడాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తుంది. తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వింటే మీరూ ఈ మాటను ఒప్పుకుంటారు. అదేంటో తెలుసుకుందాం….

ఏజెన్సీల పనితీరు…

నోట్ల రద్దుకు ముందు వరకు డెబిట్ కార్డు ఉంటే చాలు ఏటీఎం దగ్గరికెళ్లి ఎప్పుడైనా నగదు తెచ్చుకోవచ్చనుకునే వాళ్లం. పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల్లో డబ్బు ఎప్పుడూ నిలువ ఉండేది. బ్యాంక్ పక్కనే ఉన్న ఏటీఎంలలో బ్యాంకు వారే నగదు నింపేవారు. వేరే చోట్ల ఉన్నవాటిలో ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇస్తున్నాయి. ఈ ఏజెన్సీలు సబ్‌కాంట్రాక్ట్ కింద చిన్న సంస్థలకు ఇస్తున్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా ఏజెన్సీలన్నీ రూ. 12,000 నుండి రూ. 15,000 కోట్ల బ్యాంక్ డబ్బుని నింపుతున్నాయి. ఇందులోని లొసుగులను కనిపెట్టిన ఏజెన్సీ సిబ్బందిలో కొందరు, బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యేవారు. ఏటీఎంలలో నగదు నింపకుండా కొట్టేయడం, వడ్డీలకు తిప్పుకోవడం చేసేవారు. ఆడిటింగ్ జరిగే సమయానికి సక్రమంగానే ఉన్నట్టు చూపించేవారు. ఇలాంటి వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. రెండేళ్ల నుంచి డబ్బు నేరుగా వాడటాన్ని తగ్గించేందుకు ఏటీఎంలలో డబ్బు నింపడాన్ని బ్యాంకులు బాగా తగ్గించాయి.

ATM

డిజిటల్ పేరుతో…

డిజిటల్ లావాదేవీలు పెంచడం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగం పెరగడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో బ్యాంకులన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. ఒక ప్రాంతంలో రెండు అంతకంటే ఎక్కువ ఏటీఎంలు ఉంటే వాటిని తొలగించి, కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో నెలకొల్పుతున్నాయి. దీంతో ఏటీఎంల సంఖ్య పెరగడం లేదు. కొన్నిచోట్ల అయితే ఉన్న ఏటీఎంల్లో కూడా ఎప్పుడు డబ్బు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియడంలేదు. ఈ కారణంగా స్వైపింగ్ ద్వారా బిల్లు చెల్లించే విధానం ఎక్కువైంది. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలలో డబ్బు నింపేందుకు కొత్త విధానాలను ఆర్‌బీఐ ప్రకటించింది.

ఆర్‌బీఐ ప్రతిపాదనలు!

ఏటీఎంలలో నగదు నింపేందుకు కాంట్రాక్టు తీసుకునే సంస్థలు, సబ్‌కాంట్రాక్టు తీసుకునే సంస్థల నికర విలువ ఇకపై రూ.100 కోట్లు ఉండాలి. 2019 మార్చి 31 నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

– నగదు తీసుకెళ్లేందుకు ఆయుధాలు కలిగిన సిబ్బందితో పాటు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసిన వాహనాలు ప్రతిసంస్థకు 300 తప్పనిసరిగా ఉండాలి.

– ఇప్పటిదాకా ఈ ఏజెన్సీలు వ్యాన్లలో నగదును భద్రంగా తీసుకెళ్లి, ఏటీఎంలను తెరచి, వాటి క్యాసెట్‌లలో నోట్లు నింపేవి. ఇకనుంచి క్యాసెట్‌లలో బ్యాంకులే నగదు నింపి, ఈ సంస్థలకు ఇవ్వనున్నాయి. వీరు భద్రంగా ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి, డబ్బున్న క్యాసెట్‌ని అక్కడ పెట్టి, ఖాళీ క్యాసెట్‌లు బ్యాంకుకు చేరవేయాలి. దీనివల్ల ప్రజల డబ్బుకు భద్రత పెరుగుతుంది. అయితే, ఇందుకు క్యాసెట్లు ఎక్కువగా కొనుగోలు చేయాలి.

– ఒక్కో క్యాసెట్‌ ధర రూ.7,000-20,000 వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 2.36 లక్షల ఏటీఎంలు ఉన్నందున క్యాసెట్‌లు మార్చాలంటే, కొత్తగా వీటిని లక్షల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఏజెన్సీ మోసాలకు అడ్డుకట్ట!

ఈ నిభందనలు పాటిస్తే…అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు ఇక్కడ కూడా అమలవుతాయి. కానీ కొత్త క్యాసెట్లకు, వీటిని తీసుకెళ్లడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే వీటివల్ల ఏజెన్సీల్లో జరిగే మోసాలను అడ్డుకోవచ్చు. దీని విషయమై బ్యాంకులు, ఏజెన్సీల అభిప్రాయాలను ఆర్‌బీఐ తెలుసుకుంటోంది.

ఏజెన్సీల భయం

ఈ నిర్ణయంపై ఏజేన్సీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే చాలా ఏటీఎంలు మూతపడతాయి. రూ. 3000 కోట్ల భారం పడుతుందని చెబుతున్నాయి. దేశంలో 2.40 లక్షల ఏటీఎంలున్నాయి. వచ్చే మార్చికి వీటిలో 1.15 లక్షల ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని అంటున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో ఉంటాయని చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *