మంత్రులను కలిసిన హాజీపూర్‌ గ్రామస్తులు

మంత్రులను కలిసిన హాజీపూర్‌ గ్రామస్తులు

రోజులు గడుస్తున్నా హాజీపూర్‌లో పరిస్థితులు ఏమాత్రం మారలేదా? ఇంత జరిగినా కూడా అధికారుల్లో ఇంకా చలనం రాలేదా? గ్రామంలో మూడు హత్యలు జరిగినా…ఇప్పటికీ ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదా? అంటే అవును అనే సమాధానం చెహాజీపూర్‌ గ్రామస్తులు. హాజీపూర్‌కు చెందిన కొంతమంది గ్రామస్తులు మంత్రులను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.

కొన్నిరోజుల క్రితం హాజీపూర్‌లో బయటపడ్డ వరుస హత్యలు తీవ్ర కలకలం రేపాయి. పాడుబడ్డ ఓ బావిలో అమ్మాయిల మృతదేహాలు బయటపడడం దిగ్భ్రాంతికి గురిచేశాయి. పల్లె పలకరింపులతో కళకళలాడిన హాజీపూర్‌ ఒక్కసారిగా మూగబోయింది. ఉన్మాది ఘాతుకం వెలుగు చూడటంతో ఊరూ ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు చిన్నారులు అభం శుభం తెలియని ఆడపిల్లలు తమకు తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిన ఘటనలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏ గడపలో చూసిన విషాదమే ఏ ఇంట చూసిన కన్నీటి రోదనే ఇది ప్రస్తుతం హాజీపూర్‌లో పరిస్థితి. న్యాయం జరిగేంత వరకు పోరాడేందుకు హాజీపూర్‌ గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఉన్మాదికి ఉరి శిక్ష విధించే వరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా హాజీపూర్‌కు చెందిన కొంతమంది గ్రామస్తులు తెలంగాణ మంత్రులను కలిశారు. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశారు. .- తమ గ్రామంలో ప్రజలకు రక్షణ కల్పించాలని హోంమంత్రి మహమూద్ అలీని, ఈటల రాజేందర్‌ను కోరారు. మూడు హత్యలు జరిగినా…ఇప్పటికీ ఎలాంటి భద్రతాపరమైన ఏర్పాట్లు చేయలేదని మంత్రులకు వివరించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్ల నుంచి పిల్లలను బయటకు పంపించాలంటేనే భయమేస్తోందని వివరించారు.

మరోవైపు హాజీపూర్‌ గ్రామస్తుల వినతులు విన్న మంత్రులు సానుకూలంగా స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని.. అధైర్యానికి గురికావద్దని మంత్రులు సూచించారు.

మొత్తానికి హాజీపూర్‌ గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష పడే వరకు .. వదలిపెట్టే ప్రసక్తి లేదని .. తేల్చి చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *