గ్లాసువాక!

గ్లాసువాక!

ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక అందరి ఎదురుచూపులు మే 23 కోసమే. ఐతే, ఈలోగా ఆల్ పార్టీస్‌ తమ గెలుపోటములను అంచనా వేసుకునే పనిలో పడ్డాయి. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో మాత్రం మీటర్ గిర్రున తిరుగుతోంది. గ్లాసు మెరుస్తుందా..? లేక ముక్కలవుతుందా?అన్న ఉత్కంఠ నడుమ ఊహల లెక్కలు సాగుతున్నాయి.

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇక తేలాల్సింది విజయమో, పరాజయమో మాత్రమే. విశాఖ జిల్లా గాజువాకలోని అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే అనుకున్నప్పటికీ పవన్ కల్యాణ్ కూడా పోటీ చేయడంతో, క్యాలిక్యులేషన్స్‌ మారిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. ఇక్కడ పవన్ గెలుస్తారా లేదా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న.. గాజువాకలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి, జనసేన నుంచి పవన్ పోటీ చేశారు. తొలుత పల్లా-పవన్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి కూడా బలమైన పోటీనివ్వడంతో గెలుపువీరులు ఎవరన్నది ఉత్కంఠను రేపుతోంది.

2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన , ఈసారి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు. మరోవైపు, వైసీపీ శ్రేణులు కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం వెళ్లారు. దీంతోపాటు పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ఆది నుంచి పలు అవాంతరాలు ఎదురవుతానే ఉన్నాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని తెలుస్తోంది. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు.

ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది నిష్క్రమించారు. మరోపక్క ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో సౌమ్యుడిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా, పలు సమస్యల్ని సమర్థంగా పరిష్కరించిన నేతగా గుర్తింపు పొందారు. టీడీపీకి ఉన్న బలమైన ఓటుబ్యాంకు, తన అభిమానులు, తన నిర్ణయాల కారణంగా లబ్ధి పొందిన వారు ఓటేస్తే తాను సునాయాసంగా విజయం సాధిస్తానని పల్లా ధీమాగా ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *