బీజేపీలో డీకే వాయిస్ తగ్గిపోవడానికి కారణమేంటి?

బీజేపీలో డీకే వాయిస్ తగ్గిపోవడానికి కారణమేంటి?

పార్టీ మారకముందు ఓ రేంజ్‌లో ఫైర్ అయిన గద్వాల ఫైర్ బ్రాండ్‌…కమలం గూటికి చేరాక కాస్త సైలెంట్ అయిపోయారు. డీకేతో పాటు ఆ పార్టీలో చేరిన నేతల వాయిస్‌ స్లో అయిపోయింది. పార్టీలో స్వేచ్ఛ లేదా? లేక కొత్త గూటిలో సర్దుకోలేకపోతున్నారా? కమలం పార్టీలో కొత్త నేతల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ.

తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ చేసింది. దీనిలో భాగంగానే, కాంగ్రెస్-టీడీపీలతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలకు గాలం వేస్తోందట. ఇదిలా ఉంటే, ఇప్పటికే పార్టీలో చేరిన కొందరు నేతలు ప్రస్తుతం సైలెంట్‌ అయిన పరిస్థితి. బీజేపీ ఆకర్ష్‌లో భాగంగా కొందరు ముఖ్యనేతలు ఇటీవలి కాలంలో… ఆ పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరకముందు బలమైన వాయిస్ వినిపించిన వారు, బీజేపీలో చేరాక పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ముందు డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. పార్టీ కార్యలయానికి కూడా రావటం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ అరుదుగా పాల్గొంటున్నారు. కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు మాత్రమే హాజరవుతున్నారు.

పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశాలకు పిలుపు రావడం లేదని డీకే అరుణ వర్గీయులు ఆవేదన చెందుతున్నారట. కొద్ది రోజలు కిందట పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ కూడా బీజేపీలో చేరారు. కమలం గూటికి రాకమునుపు మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు పొంగులేటి. బీజేపీలో చేరిన తరువాత ఆయన తీరులో మార్పు వచ్చింది. కనీసం పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లలేకపోతున్నారట. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఒకటి రెండు మీటింగ్స్ కు తప్ప ఎక్కువగా కనిపించడం లేదు. బీజేపీలో పాతుకుపోయిన నాయకులు మాత్రం ఎప్పటిలానే పార్టీ కార్యాలయానికొస్తున్నారు. కానీ, పార్టీలో చేరిన వారు మాత్రం దూరంగా ఉంటున్నారు. మీడియా ముందుకు రావొద్దని అధిష్ఠానం నుంచి ఆదేశాలున్నట్టుగా చెబుతున్నారు.

ఇటీవల బీజేపీలో చేరిన నేతలను ..సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో పోలుస్తున్నారు. బీజేపీలో చేరాక తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నానని, గతంలో నాగం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో ఎవరైనా మాట్లాడాలంటే.. రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తీసుకోవాలట. సొంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకు ఇది సహజంగా నచ్చదు. ఈ కారణంగానే నాగం జనార్దన్ రెడ్డి బయటకు వచ్చారని అంటున్నారు.

మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న దామోదర రాజనరసింహ, మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే, ఆ వార్తలను వారు కొట్టి పారేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా బీజేపీలో చేరతారనే వాదన వినిపిస్తోంది. పార్టీ వీడుతున్నట్టుగా వస్తున్న వార్తల్ని కొందరు నేతలు ఖండిస్తున్నా…ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *