గొడుగంటే గొడుగు కాదు గాల్లో తేలుతూ వచ్చే గొడుగు

గొడుగంటే గొడుగు కాదు గాల్లో తేలుతూ వచ్చే గొడుగు
సీజన్ వస్తే గానీ గుర్తురాని వస్తువుల్లో గొడుగు ముఖ్యమైంది. వర్షాకాలంలో తప్పించి మరే సందర్భంలోనూ ఎక్కువగా ఉపయోగించం. కొందరు ఎండకాలంలో వాడతారు. ఎండ ఎక్కువగా ఉంటే శరీరానికి హానికరం. ఇక విదేశాల్లోనైతే మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి అక్కడ అదనంగా ఒక సీజన్‌కి వాడతారు. అయితే…గొడుగు వల్ల ఒక చిన్న ఇబ్బంది ఉంది. దాన్ని చేతిలో పట్టుకుని వెళ్లడం. ఇక గాలి ఎక్కువగా వీస్తే గనక అంతే సంగతులు…గొడుగు మాయం. ఇక బైక్‌పై వెళ్లేవారికి గొడుగు వాడే పరిస్థితే ఉండదు. గొడుగు వాడకం వెనక ఇన్ని కష్టాలుంటాయి మరి…ఈ కష్టాలనుంచి తప్పించడానికే కొత్తగా తేలే గొడుగు కనిపెట్టారు. ఇది మనం రోజూ వాడే గొడుగు లాంటిదే కాని అది కాదు. ఈ కొత్తరకం గొడుగుని మనం చేత్తో పట్టుకోకపోయినా మన వెంట వచ్చేస్తుంది. మన నెత్తిమీదే ఉంటూ..మనం వర్షానికి తడవకుండా..ఎండలో కందిపోకుండా..మంచులో ఉండిపోకుండా కాపాడుతుంది. ఎంత గాలి వీచినా, ఎంత వర్షం ముంచేసినా ఇది మన నెత్తిమీదనుంచి కాస్త కూడా పక్కకు వెళ్లదు. ఇదెలా సాధ్యమంటారా? టెక్నాలజీ అనే బ్రహ్మపదార్థం ఒకటి మనకుంది కదా..! ఈ శతాబ్దంలో ఏ బద్ధకానికైనా సులువైన మార్గాన్ని ఈ టెక్నాలజీ కనిపెట్టేస్తోంది.

డ్రోన్‌బ్రెల్లా…

ఈ తేలేగొడుగుని డ్రోన్‌బ్రెల్లా అని పిలుస్తున్నారట. సాధారణంగా వాడే గొడుగుల్లో హైబ్రీడ్ రకం గొడుగు ఇది. ఒక ఆప్ ద్వారా దీని కంట్రోలింగ్ నడుస్తుంది. ఈ కంట్రోల్ మోడ్‌లో మూడూ రకాలుంటాయి. మాన్యువల్, ఫాలో మీ, స్టేషనరీ. మాన్యువల్ ఆప్షన్‌లో మనం చెప్పినట్టు గొడుగు ఎటు కావాలంటే అటు ఎగురుతూ వస్తుంది. ఫాలో మీ ఆప్షన్‌లో మనం చెప్పకుండానే మనం ఎటువెళ్తే అటు గొడుగే మనవైపు వచ్చేస్తుంది. ఇక చివరగా…స్టేషనరీ ఆప్షన్. దీని ద్వారా గొడుగు ఒకేచోట స్థిరంగా ఉంటుంది. అయితే ఈ గొడుగు సుబ్బరంగా పనిచేయాలంటే మన ఫోన్‌కి డాటా ఉండాలి. ఆప్ పనిచేస్తూ ఉండాలి. మొబైల్ ఎప్పుడూ చేతిలోనే ఉండాలి.

ఈ డ్రోన్‌బ్రెల్లాపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. చివరి దశలో ఉంది. త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది. ప్రస్తుతానికి ఈ గొడుగు అంచనా ధర రూ. 20,000గా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ ప్రాచూర్యంలోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *