తండ్రీ కొడుకులే ప్రత్యర్థులు

తండ్రీ కొడుకులే ప్రత్యర్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నందిపాడు ఎంపీటీసీ పోటీ ఆసక్తిగా మారింది. అందుకు కారణం ప్రత్యర్థులుగా తండ్రి కొడుకులు పోటీ చేయడమే. తండ్రి ఓ పార్టీ నుంచి కొడుకు మరో పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. వారి గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల పోరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందిపాడు సెగ్మెంట్ ఎంపీటీసీ స్థానం గెలుపు కోసం తండ్రి కొడుకులు ప్రత్యర్థులుగా మారారు. తండ్రి పండా ముత్యాలు.. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పోటీ చేస్తుంటే.. అతని కుమారుడు పండారాజు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. తండ్రి కొడుకులు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.

పండా ముత్యాలు మొదటి నుంచి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో కార్యకర్తగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి. వార్డు మెంబరుగా పనిచేసిన అనుభవం ఉంది. ఎంపీటీసీగా గెలిచి తన సెగ్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తానని పండా ముత్యాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక నందిపాడు ఎంపీటీసీ స్థానానికి తండ్రికి పోటీగా బరిలో దిగిన పండా రాజు టీఆర్‌ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు. తండ్రి రాజకీయ ప్రభావం తనపై ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీతోనే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

తండ్రి కొడుకులైన భిన్నాభిప్రాయాలతో వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తండ్రికొడుకుల పోటీ అశ్వారావుపేట మండలం నందిపాడు సెగ్మెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇరు పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో గెలుపుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. బంధాలు,బంధుత్వాలు,వ్యక్తిగత సత్సంబంధాలు,రాజకీయాల్లో ఉండబోవని ఈ తండ్రి కొడుకుల పోటీ చూస్తే అర్థమవుతుంది అంటున్నారు అక్కడి స్థానికులు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *