ఫేస్‌బుక్‌లో కుటుంబ వివరాలను బయటపెట్టే ఫీచర్

ఫేస్‌బుక్‌లో కుటుంబ వివరాలను  బయటపెట్టే ఫీచర్

ముందు ముందు ఫేస్‌బుక్‌ ద్వారా మన జీవితం మొత్తం తెలిసిపోతుందేమో…మనం ఏం చూస్తున్నాం, ఏం కొంటున్నాం…లాంటివన్నీ బహిర్గతం అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో మనం ఏదైనా వెతికినపుడు దానికి సంబంధించినవి మన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో స్క్రోల్ చేస్తున్నపుడు కనిపిస్తాయి. దీని ఆధారంగా యాడ్స్‌ని మనకు కనబడేలా చేస్తాయి యాడ్ కంపెనీలు. ఈ పనిని ఇంకా సులభతరం చేయబోతోంది ఫేస్‌బుక్.

facebook family

కొత్త ఆల్గరిథమ్…

ఒక వ్యక్తి ఇంటర్‌నెట్‌లో వెతికిన సమాచారం ఆధారంగా అతనికి కనిపించే ప్రకటనలనే…అతని కుటుంబంలోని మిగిలిన వారికి కూడా కనిపించేలా ప్రత్యేక వ్యవస్థను అందించనుంది. ఒక వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో షేర్ చేసుకున్న ఫోటోలను ఆధారం చేసుకుని, ఆ వ్యక్తితో ఎవరెవరు నివసిస్తున్నారో కనిపెట్టే ఆల్గరిథమ్‌ను ఆ సంస్థ తయారుచేయనుంది. ఈ ఫీచర్‌ను ఏడాది క్రితమే రూపొందించినా…ఫేస్‌బుక్ దీన్ని ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతం ఫేస్‌బుక్ ప్రొఫైల్ ద్వారా కుటుంబ సభ్యులు, సన్నిహితుల వివరాలు నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వీరు ఉండే ప్రాంతం, ఇంటిపేరు, తిరిగిన ప్రదేశాలు, కార్యక్రమాల ఆధారంగా ఒకే ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అనే వివరాలు కొంత తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇపుడొచ్చే కొత్త పరిజ్ఞానం దీన్ని మరింత సులభతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఫోటో ట్యాగ్స్, పోస్ట్ చేసిన ఐపి అడ్రస్‌లు, ప్రొఫైల్‌లోని చిరునామా లాంటి అంశాల ఆధారంగా ఒక వ్యక్తి ఎవరితో నివసిస్తున్నాడో ఫేస్‌బుక్ పసిగడుతుంది.

ప్రకటనలకు ఉపయోగం!

ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉన్నపుడు దిగిన ఫోటోను వారి ప్రొఫైల్స్‌కు ట్యాగ్ చేస్తాడనుకుందాం. వారిలో తక్కువ వయసు ఉన్న అమ్మాయి ఉంది. డిస్క్రిప్షన్‌లో ‘ మై ఏంజిల్ ‘ అని రాశాడనుకుందాం. వీటి ఆధారంగా వారి ముఖాలను ఆల్గరిథమ్‌ ఒక కుటుంబంగా నిర్ధారిస్తుంది. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు పోస్ట్ చేసిన వ్యక్తి భార్య, ఇంకొకరు కూతురు అని గుర్తిస్తుంది. ఈ పరిజ్ఞానం విషయంలో ఖచ్చితంగా పనిచేస్తుందా…అనే బేధాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ప్రకటనలు కనిపించేలా చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఫోటోలో పురుషులను, స్త్రీలను ఎంతమంది ఉన్నారో ఆల్గరిథమ్‌ గుర్తిస్తుంది. ఫోటో పోస్ట్ చేసిన వ్యక్తి పురుషుడైతే అతని సెర్చ్ హిస్టరీ ఆధారం చేసుకుని అతనికి కనిపించే వస్తువుల ప్రకటనలు ఫోటోలోని ఇతర పురుషులకూ కనిపిస్తాయి.

ఈ ఆల్గరిథమ్ గురించి ఫేస్‌బుక్ సంపూర్ణంగా స్పష్టత ఇవ్వలేదు. దీన్ని ఖచ్చితంగా ఉపయోస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ ఆల్గరిథమ్‌ను అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *