ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌

ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌

ఐసీపీ వరల్డ్‌ కప్‌ 2019లో భాగంగా రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతేకాదు.. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న బ్రిటీష్‌ ఆటగాళ్లు సెమీ ఫైనల్‌లో చాంపియన్‌లా ఆడారు. దీంతో స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టారు. అయితే.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లోకి ఇంగ్లండ్‌ అడుగుపెట్టింది.

చెప్పాలంటే.. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ వీరవిహారం చేశాడు. రాయ్‌కు తోడు రూట్, బెయిర్ స్టోలు రాణించడంతో ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాదు.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇక ఆసీస్ పతనాన్ని శాసించిన క్రిస్‌ వోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్‌, ఆర్చర్‌లు రెచ్చిపోవడంతో ఆసీస్‌ విలవిల్లాడింది. అయితే స్టీవ్‌ స్మిత్‌ తన బ్యాటింగ్‌ లైనప్‌తో అద్భుతప్రదర్శన చేశాడు. ఇక స్మిత్‌తో పాటు అలెక్స్‌ కారీ.. గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో మ్యాక్స్‌వెల్‌, స్టార్క్‌లు సమయోచిత బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ముందుంచగలిగింది.

మొత్తానికి అచ్చొచ్చిన మైదానంలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి.. దర్జాగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఇప్పటికే ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌ జట్టుతో ఆదివారం లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌ అమీతుమీకి సిద్ధమైంది. దీంతో ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది. ఇక ప్రపంచకప్‌ విజేతకు 27కోట్ల 38లక్షల రుపాయలు.. రన్నరప్‌కు 13కోట్ల 7లక్షల రుపాయలు అందిచనుంది ఐసీసీ. ప్రపంచకప్ నెగ్గిన జట్టు ప్రైజ్‌మనీతో పాటు బంగారు ట్రోఫీ కూడా అందుకుంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *