ముగిసిన నౌహీరా షేక్ విచారణ

ముగిసిన నౌహీరా షేక్ విచారణ

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నా హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహీరా షేక్‌, ఆమె పర్సనల్‌ అసిస్టెంట్‌ మోజీ థామస్‌, బిజూ థామ్‌సను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో వారిని విచారించేందుకు కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ముగ్గురినీ విచారించిన అనంతరం 21వ తేదీ సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. నౌహీరా షేక్‌ రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నట్లు జైలువర్గాలు తెలిపాయి. కొంతకాలంగా బీపీ, షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకున్న అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి విచారించనున్నారు.

లక్షల మంది డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలతోపాటు మనీ లాండరింగ్‌ వెలుగు చూడటంతో ఈ కేసును ఈడీ విచారించనుంది. హీరా గ్రూప్‌పై 2012లో అనుమానాలు వ్యక్తం చేసిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. గత ఏడాది బంజారాహిల్స్‌లో మరో కేసు నమోదు కావడంతో సీసీఎ్‌సకు బదిలీ చేశారు. విచారణ జరిపిన పోలీసులు గత ఏడాది అక్టోబర్‌ మూడో వారంలో నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితుల సంఖ్య పెరగడంతో కేసులూ పెరుగుతూ వచ్చాయి. విచారణలో హీరా గ్రూప్‌ ఉద్యోగులు సహకరించకపోవడంతో ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. వేల కోట్ల లావాదేవీలు జరిగాయని.. విదేశీ పెట్టుబడులు కూడా కంపెనీలోకి వచ్చాయని.. విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని గుర్తించారు. దీంతో ఈ కేసును విచారించాలంటూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయాలకు సీసీఎస్‌ అధికారులు లేఖలు రాశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన ఈడీ ఈ కుంభకోణం వెనుక మనీ లాండరింగ్‌ ఉన్నట్లు గుర్తించింది. డిపాజిట్లు దారి మళ్లిన, విదేశీ డిపాజిట్లు సేకరించిన తీరును గమనించి నౌహీరా షేక్‌ను విచారించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ అనంతరం పీఎంఎల్‌ఏ చట్టం కింద ఆమె ఆస్తులను అటాచ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నౌహీరా షేక్‌ను అరెస్టు చేసి 90 రోజులు పూర్తయినా.. సీసీఎస్‌ తరపున చార్జిషీట్‌ దాఖలు చేయలేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును బుధవారానికి వాయిదా వేసినట్లు నాంపల్లి కోర్టు వెలువరించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *