మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు

మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలు జరిగినప్పటికీ గెలుపు ఎవరిదో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళే ఆ ఉత్కంఠకు తెరదించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. అందుకుగాను 8 వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

ఇక సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. అయితే ఈ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి. ఇక ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీవైపు నిలిచారో.. ఏ పార్టీకి పట్టం కట్టారో అన్న ఉత్కంఠను తెరదించేందుకు ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. దీంతో మరికాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

ఇవాళ ఉదయం 8 గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే.. తొలత పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇక ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. ఇకపోతే దేశవ్యాప్తంగా సుమారు 10లక్షల 3వేల కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించగా 20, 600 కేంద్రాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్‌ నమోదు కాగా మొత్తం 99కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక చెప్పాలంటే ఇప్పటివరకు భారత పార్లమెంట్‌కు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధిక శాతం. మరోవైపు చూస్తే పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 18లక్షల మంది ఉద్యోగుల్లో 16.49 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు కొన్ని గంటల సమయం పడుతుందని ఈసీ భావిస్తోంది.

ఇక వీవీప్యాట్‌ స్లిప్పులను చివరలో లెక్కించనున్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాక ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిచూస్తారు. రెండింటికీ మధ్య వ్యత్యాసం వస్తే వీవీప్యాట్‌ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుకు సుమారు ఐదు గంటల సమయం పడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇక కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *