మహానాడుకు ఫలితాల ఎఫెక్ట్

మహానాడుకు ఫలితాల ఎఫెక్ట్

పసుపు పండుగ నిర్వహణపై తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఫలితాల వేళ, టీడీపీ పండగ జరపాలా? వద్దా ? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సమయం లేదు మిత్రమా వాయిదా వేద్దామని కొందరు అంటుంటే…ఒక్కరోజైనా జరపాల్సిందేనని మరికొందరు పట్టుబడుతున్నారట. దీంతో, అధినేత డైలమాలో పడ్డారట.

తెలుగుదేశం పార్టీ ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడుపై ఈసారి తర్జనభర్జన కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు – అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు మహానాడు నిర్వహణపై చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మహానాడు నిర్వహణకు సమయం సరిపోదని కొందరు నేతలు సూచించారట. అంతగా టైమ్‌ లేదు కాబట్టి మహానాడును వాయిదా వేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. మహానాడు స్థానంలో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా చేద్దామని పలువురు నేతలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఈసారి ఎన్నికల నేపథ్యంలో దానిపై పార్టీ పెద్దగా దృష్టిసారించలేదు. ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీకి మధ్య నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఫలితాలు ఈనెల 23న వెలువడనున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండడంతో, 27వతేదీ నుంచి నిర్వహించాల్సిన మహానాడుకు సమయం సరిపోదని పార్టీ నేతలు సూచించారట. 1985, 1991, 1996లలో కూడా మహానాడు నిర్వహించలేదు. ఉప ఎన్నికల కారణంగా 2012 లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది.

ఇది ఇలా ఉంటే… మరోసారి తమదే అధికారమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మహానాడును నిర్వహించకపోతే, పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశముందని కొందరి అభిప్రాయం. కనీసం ఒక్కరోజైనా మహానాడు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతోందట. అత్యంత కీలకమైన వ్యవస్థాపక అధ్యక్షుడి పుట్టిన రోజున, మహానాడును జరపకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. మహానాడు నిర్వహణకు, చంద్రబాబు బిజీగా ఉంటారనే కారణాలు ఏ మాత్రం సహేతుకంగా లేవనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. నేతల అభిప్రాయాలన్నీ సావధానంగా విన్న చంద్రబాబు…. తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలుగు తమ్ముళ్లు ఆశాభావంతో ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *