దశలు ముగుస్తున్నాయి... దిశ మారుతుందా...!?

దశలు ముగుస్తున్నాయి... దిశ మారుతుందా...!?

దేశంలో సార్వత్రిక ఎన్నికల అంకం చివరి దశకు చేరుకుంది. మొత్తం ఏడు దశల పోలింగులో ఐదు విడతలు ముగిశాయి. ఇక రెండు విడతల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు దశల పోలింగ్ తమకు అనుకూలిస్తుందని జాతీయ పార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ ఆశలు పెంచుకున్నాయి. తొలి దశలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించి తమ నెత్తిన పాలు పోశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి మూడు దశల్లోనూ తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలలో ఎన్నికలు జరిపి మిగిలిన దశలలో వ్యూహప్రతివ్యూహాలను రచించాలని భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ వేసిందనీ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది… ఏ పార్టీకి నష్టం చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మూడు వంతుల స్థానాలలో పోలింగ్ ముగిసింది. మిగిలిన రెండు దశల్లోనూ తమకు అనుకూలిస్తుందా..? లేదా..? అని అధికార భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలూ లెక్కలు వేసుకుంటున్నాయి.

ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వందలకు పైగా స్థానాల ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి 150కి మించి సీట్లు దక్కవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరి రెండు దశల్లో జరిగే ఎన్నికలపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయనీ చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ జరిగిన పోలింగుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన పరిస్థితులు కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఐదు దశలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు ఒక్క పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ఈ పరిస్థితులలో “స్నేహ హస్తం” అందించేందుకు ఎవరున్నారా అని అటు బీజేపి, ఇటు కాంగ్రెస్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఒక్క స్థానం వచ్చిన రాజకీయ పార్టీని కూడా మిత్రుడిగానే చేసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని… ఆ పార్టీ వారే అంచనాకు వచ్చిన్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులలో దేశంలో మిగిలిన రెండు దశల్లో పోలింగ్ ఏ పార్టీ తలరాతను మారుస్తుందో తేలాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే…!!!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *