ఏపీ కేబినెట్ భేటీకి గ్రీన్‌ సిగ్నల్

ఏపీ కేబినెట్ భేటీకి గ్రీన్‌ సిగ్నల్

ఏపీ కేబినెట్ భేటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సమావేశం నిర్వహించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మంత్రులు, అధికారుల సహా భేటీకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హాజరవుతున్నారు. సీఎస్ , టీడీపీ పార్టీ నేతల మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంతో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ వీడింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ పంపిన నాలుగు అంశాలపై సమీక్షకు అనుమతించింది. దీంతో నేడు నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

వాస్తవానికి మంత్రి వర్గ సమావేశం ఈనెల 10నే జరగాల్సి ఉంది. ఏపీలో ప్రధానంగా నాలుగు అంశాలపై అత్యవసరంగా కేబినెట్‌ భేటీ నిర్వహించాలని సీఎంవో నిర్ణయించింది. ఫని తుపాను, కరవు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై అత్యవసరంగా చర్చించాల్సి ఉన్నందున కేబినెట్‌ భేటీ నిర్వహించాలని భావించింది కానీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అడ్డుచెప్పారు. భేటీకి సంబంధించిన అజెండాను 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి.. అనుమతి తీసుకున్న తర్వాతే.. మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని స్పష్టంచేశారు

సీఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంపై.. టీడీపీ నేతలు ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. కావాలనే అడ్డుపడుతున్నారంటూ విమర్శలు చేశారు. మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతివ్వదని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *