శ్రీకాకుళంలో మందుబాబులు రెచ్చిపోయారు

శ్రీకాకుళంలో మందుబాబులు రెచ్చిపోయారు

అసలే ఎండాకాలం. నోరు మంచినీళ్ల కోసం ఎండగట్టుకపోతుంటే.., మందుబాబులు మాత్రం ఎండకు తట్టుకోలేక బీర్లను తెగతాగేస్తున్నారు. ఇంకేముంది అసలే కోతి.. ఆపైన కళ్లు తాగి అన్న చందంగా ఓ వైన్‌ షాప్‌లో చిన్న గొడవకు తలలు పగిలేలా చావగొట్టుకున్నారు ఈ మందుబాబులు. దీంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొద్దిసేపు బీతావహ వాతావరణం నెలకొంది.

శ్రీకాకుళం జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో పరస్పరం బీరు బాటిళ్లతో దాడి చేసుకున్నారు. విచక్షణా రహితంగా కొట్టుకోవడంతో ఇద్దరు యువకుల తలలకు తీవ్ర గాయాలు కాగా.. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. టెక్కలి పట్టణం సుదర్శన్‌ థియేటర్‌ సమీపంలోని రాజా వైన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాజా వైన్స్‌లో ఓ టేబులు వద్ద కొందరు యువకులు తాగుతున్నారు. ఇంతలో స్థానికంగా ఉంటున్న మరికొందరు యువకులు మరో టేబుల్ వద్ద తాగడం ప్రారంభించారు. ఇంకేముంది.. మందు బాబులం మేము మందు బాబులం .. మందు కొడితే మాకు మేము మ‌హారాజులం అంటూ పాట‌లు పాడేసుకుంటున్నారు. సీన్‌కట్‌ చేస్తే.. ఓ టేబుల్ వద్ద ఉన్న యువకుడు సిగరెట్ తాగడం.., మరో టేబుల్ వద్ద కూర్చున్న వారికి నచ్చలేదు. దీంతో వేరే దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగమని చెప్పారు. ఇంకేముంది మాటమాటలతో ప్రారంభమైన గొడవ.. బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు యువకుల తలలు పగిలాయి. ఇక గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

మొత్తానికి మద్యం మత్తులో యువకులు సృష్టించిన వీరంగం.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు మద్యం సీసాలతో దాడులు చేసుకుని తలలు పగలకొట్టుకునే వరకు వెళ్లింది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *