ప్రాణం మీదకు తెచ్చిన డ్రైవర్ నిర్లక్ష్యం

ప్రాణం మీదకు తెచ్చిన డ్రైవర్ నిర్లక్ష్యం

కర్నూలు వెల్దుర్తి ఘటన మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరార్‌ కాగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణం మీదకు తెచ్చింది. డ్రైవింగ్ చేస్తూనే స్టీరింగ్ వదిలిన డ్రైవర్.. గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకోవడంతో బస్సు అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి పడిపోయింది. ప్రమాదంలో 20కి పైగా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. టీవీనగర్ సమీపంలో బస్సు మానేరు వంతెన దాటుతున్న సమయంలో అదుపుతప్పి, పక్కనున్న 9 మీటర్ల లోతైన గొయ్యిలోకి పడిపోయింది. బస్సుకు చెట్టు కొమ్మలు అడ్డుగా నిలవడంతో ప్రాణ నష్టం తప్పింది. లేకుంటే భారీ ప్రమాదమే సంభవించి ఉండేది.

బస్సు వంతెన దాటుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన డ్రైవర్… గుట్కా వేసుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహారించి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు… అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వరుస ప్రమాద ఘటనలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై దృష్టి సారించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *