తాగునీరు లేక కడపజిల్లా ప్రజల అవస్థలు

తాగునీరు లేక కడపజిల్లా ప్రజల అవస్థలు

ట్యాంకర్లలో రెంటుకు నీళ్లను తెప్పించుకునే వాళ్లను చూసి ఉంటారు..టూ వీలర్లకు క్యాన్లు కట్టి కష్టపడేవారిని కని ఉంటారు. కానీ కడప జిల్లాలో నీళ్లను మోసుకెళ్లడం కోసం పెద్ద సాహసమే చేస్తున్నారు ఓ గ్రామస్థులు. వేలకు వేలు ఖర్చు చేసి పానిపట్టు యుద్ధం చేస్తున్నారు.

బోర్లు ఎండిపోయాయ్..బావులు అడుగంటాయ్..నదులు ఎడారులను తలపిస్తోంటే.. నీళ్లు లేక కాలువలు నోళ్లు తెరుస్తున్నాయి. నీటి జాడ దొరికితే చాలు ఆడ, మగా, చిన్నా పెద్దా బిందెలు పట్టుకొని పందం పెట్టుకున్నట్టే పరిగెత్తేస్తున్నారు. కడప జిల్లా వాసులను తాగు నీటి సమస్య వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం జనం పడరాని కష్టాలు పడుతున్నారు..మైళ్లకు మైళ్లు నడుస్తూ ప్రాణం తీసుకుంటున్నారు.

కడప జిల్లా వద్దిరాల గ్రామంలో తీవ్ర తాగునీటి కష్టాలకు నిదర్శనం ఈ దృశ్యం. నీటి కోసం పదే పదే నల్లాల వద్దకు రాలేక… ప్రత్యేకంగా తోపుడు బండ్లనే కొనుగోలు చేశారు గ్రామస్థులు. గ్రామంలో ఏ కుళాయిలో నీరు వస్తే అక్కడ అంతా వాలిపోతారు. అయితే ఆయా నల్లాల నుంచి వచ్చే నీరు సన్నటి ధారగా రావడంతోఒక్కో బిందె నిండటానికి అధిక సమయం పడుతోంది. ఫలితంగా మాటిమాటికి ఇంటికి తిరగాల్సి రావడమేగాక.. గంటల కొద్దీ సమయం వృథా అవుతోంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇలా తోపుడు బండ్లను సమకూర్చుకుంటున్నారు.

ఈ తోపుడు బండ్లతో ఒకేసారి ఐదు లేదా ఆరు బిందెలు నింపుకొని తీసుకెళ్తుంటారు. ఈ తోపుడు బండ్ల కోసం ఒక్కోదానికి 5 వేలు వెచ్చించి బెంగళూరు నుంచి వీటిని తెప్పించుకున్నారు. అయితే ఆ స్థోమత లేనివారికి మాత్రం నిత్యం నరకం తప్పడం లేదు. ఐదేళ్లుగా ఇదే సమస్యను అనుభవిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.

ఇదే విషయమై మోజో అధికారులను ప్రశ్నిస్తే.. వద్దిరాలలో అసలు నీటి సమస్యే లేదని ఒకరు చెప్తే.. మరో అధికారి మాత్రం సమస్యను పరిష్కరిస్తామంటూ పాతపాటే పాడారు. శాశ్వతంగా సమస్యను పరిష్కరించడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తామని చెప్పారు.తాగు నీటి సమస్యను అధిగమించేందుకు వద్దిరాల గ్రామస్థులు పడుతున్న కష్టాన్నిచూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *