ఎన్నికల విధుల్లో గాడిదలు..జీతం 2 వేలు..!

ఎన్నికల విధుల్లో గాడిదలు..జీతం 2 వేలు..!

గాడిదలు హీరోలయ్యాయి. కాదు..కాదు..గాడిదలకు హీరోల పేర్లొచ్చాయి. ఎందుకంటే, తమిళనాడులోని పెన్నగారమ్ నియోజకవర్గంలో ఆ గాడిదలు లేకపోతే ఎన్నికలు జరగవు. ఆ గాడిదలు దగ్గరుండి ఎన్నికల అధికారులను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తాయి. ఆ గాడిదలు లేకపోతే ఈవీఎంలను తీసుకువెళ్లేవారు కూడా ఉండరు. పైగా ఆ గాడిదలు ఎన్నికల నిర్వహణలో కీలకమైనవి కావడంతో వాటికి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు అధికారులు. అంతా గందరగోళంగా ఉంది కదా! అసలు విషయమేంటో తెలుసుకుందాం..!!

తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని పెన్నగారమ్ నియోజకవర్గం హైవే రోడ్డుకి 4 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో 341 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం అధికారులు గాడిదలను వాహనాలుగా ఉపయోగించి EVMలను ఆ గ్రామానికి తరలిస్తారు. దీనికి కారణం ఆ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. రోడ్డు లేదు కాబట్టి వాహనాలు వెళ్లడానికి ఉండదు. దీంతో EVMలను పోలింగ్ కేంద్రానికి మోసుకెళ్లడానికి ఎన్నికల అధికారులకు, ఆ ప్రాంత జనానికి శక్తి లేదు. దీంతో గాడిదలతో ఒప్పందం చేసుకున్నారు అధికారులు.

గాడిదల భుజాలమీద EVMలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నస్వామి అనే వ్యక్తికి చెందిన ఆ గాడిదలకు సినిమా హీరోల పేర్లు పెట్టాడు. రజినీ, కమల్, అజిత్, విజయ్ అని వాటికి పేర్లు. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిదల భుజాలమీదే EVMలను తరలిస్తున్నారని చిన్నస్వామి చెప్పాడు. పైగా EVMలను తరలిస్తున్నందుకు ఒక్కో గాడిదకు 2 వేలు సొమ్ముని ఇస్తున్నారని తెలిపాడు.

దేశంలోని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి..ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పాత్ర వహించాలి అని చెప్పే ఎన్నికల అధికారులకూ, ఘనత లేని రాజకీయ నాయకులకూ ఆ గ్రామంలో ఎందుకు రోడ్డు లేదనే సందేహం రాలేదు. ఇన్నేళ్ల నుంచి ఆ గ్రామ ఓటర్ల ఓట్లు కావాలి కానీ, ఆ గ్రామానికి తగినన్ని సౌకర్యాలు కల్పించాలని ఎవరికీ కనీస బాధ్యత లేకపోవడం గమనార్హం. ఓట్ల కోసం నానాగడ్డి తినే నేతలు ఓటేసిన ప్రజలకు తగిన సౌకర్యాలు ఇవ్వడానికి మాత్రం రారు. ఐదేళ్లకొకసారి వార్తల్లో ఆ గ్రామానికి…గాడిదలు ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ అవుతాయని చెప్పుకోవడం మినహా మరేమీ ఉండదు. ఇకముందైనా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తారేమోనని ఎదురుచూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *