బాసర సరస్వతి ఆలయంలో భద్రత కరువైందా?

బాసర సరస్వతి ఆలయంలో భద్రత కరువైందా?

బాసర సరస్వతి ఆలయంలో భద్రత కరువైందా? అమ్మవారికే శఠగోపం పెట్టే వారు అక్కడే తయారయ్యారా? మొన్నటి అమ్మవారి విగ్రహం తరలింపుపై వివాదం ఇంకా సద్దుమణకముందే.. తాజాగా ఆ విగ్రహాం బంగారు కిరీటంలో కెంపు మాయం కావడం సంచలనం రేపుతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు.. పెద్దగా నష్టపోయిందేమి లేదన్నట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరుస వివాదాలతో బాసర ప్రతిష్ట మసకబారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయంలో వరుసగా ఆపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమ్మవారి బంగారు కిరీటంలో కెంపు కనిపించకుండాపోవడం కలకలం రేపుతోంది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో ఓ కెంపు కొంత కాలంగా కనిపించడం లేదు. విషయాన్ని భక్తులు గుర్తించేవరకు కూడా అధికారులు కనుక్కోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.2006లో హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు అమ్మవారికి నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. ఇందులో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు పొదిగి ఉన్నాయి. ప్రతిరోజు అభిషేకం అనంతరం అమ్మవారికి ఈ కిరీటం అలంకరిస్తారు. నవరత్నాలతో విగ్రహం ధగధగమెరిసిపోయేది. ఇందులో ఆ కెంపు కనిపించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

అమ్మవారి అభిషేక పూజ సమయాల్లో కెంపు ఊడిపోయినట్లు ఆలయం అధికారులు చెప్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సంధ్యారాణి అంటున్నారు. అయితే పోయిన కెంపు పెద్ద విలువైందని కాదన్నట్టు ఆమె మట్లాడటంపై భక్తులు మండిపడుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారటంతో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెల్సుకుని… నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్‌కు సూచించారు. అయితే కావాలనే కెంపు తస్కరించారా లేక పొరపాటున పోయిందా అన్న అంశాలపై విచారణ జరిపిస్తామని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *