టిక్‌టాక్ మోజు...భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న మహిళ

టిక్‌టాక్ మోజు...భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న మహిళ

వ్యసనం ఏదైనా నష్టం కలిగించేదే…ఇది మరోసారి ఋజువైంది. ఒకప్పుడు టీవీ వ్యసనంగా ఉండేది. తర్వాత మొబైల్‌ఫోన్ వచ్చింది. ఆ తర్వాత స్మార్‌ఫోన్ వ్యసనం. ప్రస్తుతమైతే రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల వ్యసనం నడుస్తోంది. గతంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అలవాటుగా ఉండేది. మళ్లీ ఇన్‌స్టాగ్రామ్, కొన్నాళ్ల క్రితం డబ్‌స్మాష్ రోగం ఉండేది. ఇక ఈ మధ్య టిక్‌టాక్ వ్యసనం యువతనే కాకుడా పెద్దవాళ్లను సైతం మింగేస్తోంది. పొద్దున లేవగానే మొఖానికి ఇంత పౌడర్ రాసుకుని టిక్‌టాక్ ముందు పిచ్చి గంతులేస్తూ, పిచ్చి పిచ్చి డైలాగులతో అడిక్ట్ అయిపోతున్నారు. అయితే…ఇలాంటివి సరదా కోసమైతే పర్లేదు కానీ జీవితాన్నే కబ్జా చేసే స్థాయికి రావడమే బాధాకరం.

తమిళనాడులో ఓ మహిళ టిక్‌టాక్ వ్యసనంలో పడి కన్నబిడ్డల్ని కూడా పట్టించుకోవడం మానేసింది. ఇది తెలిసి మందలించిన భర్తపై కోపంతో ఆ మహిళ టిక్‌టాక్‌లో వీడియో చేసి ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట సంచలనంగా మారింది. అసలు సంగతేంటంటే…పెరమలూరుకు చెందిన శివ, అనితలకు ఏడేళ్ల క్రితం పెళ్లి అయింది. శివ కుటుంబం గడవడానికని ఉపాధి కోసం సింగపూర్‌కు వెళ్లాడు. అనిత పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే ఉంటోంది. అనిత ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో ఏమీ పాలుపోక టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. అయితే..ఆ అలవాటు మరీ ఎక్కువై పిల్లలను కూడా పట్టించుకోలేనంతగా మారింది. ఈ విషయం తెలిసి శివ ఆమెను మందలించాడు. అప్పటికీ ఆమె తీరుని మార్చుకోలేదు. ఈ మధ్యనే వారి చిన్న కొడుకు కిందపడి దెబ్బలు తగిలాయి. అనితా ఈ విషయం పట్టించుకోకుండా టిక్‌టాక్‌లో పడిందంటూ చుట్టుపక్కల వారు శివకు చెప్పారు. దీంతో ఆగ్రహానికి లోనైన శివ…అనితకు చీవాట్లు పెట్టాడు. దీనికి మనస్తాపం చెందిన అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అక్కడితో ఆగకుండా భర్త తిట్టాడనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టింది. ఆమె పురుగుల మందు తాగిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. కొంత సమయం తర్వాత ఇంట్లో స్పృహ తప్పి ఉన్న ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *