నేటితో నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి

నేటితో నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి

ఇవాళ్టికి సరిగ్గా రెండేళ్ల క్రితం దేశంలోని ప్రజలు బతకడం గురించి భయపడ్డారు. రేపటికి తిండి ఉండదని ఏడ్చారు. అందరికీ గుర్తుండే ఉంటుంది…రెండేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తామని 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఆరోజు రాత్రి ఎవరికీ నిద్ర కూడా లేకుండా చేశారు. ఉదయం లేవగానే స్థాయి బేధం లేకుండా అందరూ బ్యాంకుల దగ్గర క్యూల్లో నిల్చొని బిక్కుబిక్కుమని ఒకరి ముఖాలను ఒకరు చూసుకుని కృంగిపోయారు. పైసా పైసా దాచుకున్న చిల్లరను తీసుకుని కనీస అవసరాల కోసం తిప్పలు పడ్డారు. భోజనం చేయడానికి కూడా లేకుండా మోదీ ప్రభుత్వం ప్రజల జేబుల్లోని నోట్లను లాక్కుంది.

95 శాతం లావాదేవీలు…

దేశంలోని 95 శాతం మంది ప్రజలు నోట్ల రూపంలోనే లావాదేవీలు జరుపుతారు. ఒక్కసారిగా నోట్లన్నీ రద్దవడంతో చేతిలో డబ్బున్నా కావాల్సినవి తీసుకునే వీలు లేకుండా పోయింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి మరీ దారుణం. ఎప్పటికపుడు బ్యాంకుకు వెళ్లి డీడీలు కట్టే వాళ్లూ, చలాన్ కట్టేవాళ్లూ సమయానికి కట్టక ఆర్థికంగా కుదేలైపోయారు. నోట్ల రద్దు ప్రకటన సమయంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వివాహాలు రద్దు చేసుకున్నారు, చిన్న దుకాణాలు మూతపడ్డాయి, ఆర్థికకార్యకలాపాలు దెబ్బతిన్నాయి.

అలా చెప్పాడు…

మోడీ నోట్ల రద్దును ప్రకటించడానికి చెప్పిన మూడు ముఖ్యకారణాలు. నల్లధన నిర్మూలన, నకిలీనోట్ల ను అరికట్టడం, ఆర్థిక ఉగ్రవాదాన్ని అంతం చేయడం అన్నారు.
ఇదంతా ఎందుకోసం చేశావని బాధను వెళ్లగక్కిన ప్రజలకు మోదీ ఇచ్చిన సమాధానం…”నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, దేశ ఆర్థిక పరిస్థితిని మారుస్తాను. అలా చేయకపోతే నన్ను ఉరితీయండి ” అన్నారు. ఆరోజు నుంచి ఈరోజు దాకా యాభై కాదు ఏడువందల ముప్పై రోజులు గడిచాయి. ఇప్పటికీ దేశం ఎలాంటి స్థితిలో ఉందో అలాగే ఉంది. కొన్ని విభాగాల్లో ఇంకా దిగజారిపోయింది కూడా…ప్రజల జీవన గతి ఏమాత్రమూ మారలేదు. ఒకపూట భోజనం దొరక్క చనిపోయేవారి సంఖ్య తగ్గలేదు. నివాసం లేక వీధుల్లోనూ, రోడ్ల మీదా, పార్కుల్లోనూ పడుకునే వారికి జరిగిన మేలూ ఏమీలేదు.

ఛూమంతర్..!

మోదీ ప్రభుత్వం చెప్పినట్టు, నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదులు, తీవ్రవాదులు…అవినీతిపరుల దగ్గర ఉండే దొంగడబ్బు చెల్లకుండా పోతుంది. ప్రజల వద్ద ఉండే సొమ్ము డిపాజిట్ అయ్యి, బ్యాంకుల్లో వడ్డీలు తగ్గుతాయి. ఇక అంతా అభివృద్ధే అన్న మాటలన్నీ మాయామంత్రం ఛూమంతర్ గాలే… దేశంలోని ప్రజలందరూ గంతలు కట్టుకోకుండా కూడా దొంగను పట్టుకోలేని నిస్సహాయ స్థితిలోకి, అచేతనావస్థలోకి వెళ్లిపోయారు. ఇంతపెద్ద నిర్ణయం వల్ల దేశ ఆర్థిక స్థితి మారిందా అంటే అదీ లేదు. ఈ నోట్ల రద్దు వల్ల సంపూర్ణంగా లాభపడ్డది ఒకే ఒక వ్యవస్థ…అదే రాజకీయం. రాజకీయ నాయకులందరూ ఈ నిర్ణయానికి ముందు, తర్వాత కూడా వారి దగ్గరున్న వెయ్యి, ఐదు వందల నోట్లను బ్యాంకుల నుంచి దర్జాగా, బ్యాంకు గుమ్మ ముందునుంచే వెళ్లి మార్చుకుని వచ్చారు. రద్దయిన నోట్లన్నీ వెళ్లినా బ్యాంకుల పరిస్థితిలోనైనా మార్పుందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు పనిచేయని స్థితి ఉంది, వడ్డీ తగ్గించని గతీ ఉంది.

అమిత్…బహుత్…

ప్రధాని మోదీ స్నేహితుడు, బీజేపీ అద్యక్షుడు అమిత్‌షా గురించే చెప్పుకుంటే…ముంబై ప్రాంతానికి చెందిన మనోరంజన్ రాయ్, సమాచారా హక్కు చట్టం ద్వారా స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ట్ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లకు సంబంధించిన వివరాలు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన సమాచారం చూస్తే దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిశాయి. నాబార్డ్‌కు ఆర్టీఐ ద్వారా అడగ్గా….నాబార్డ్ పూర్తి లెక్కలతో సహా వివరాలు అందించింది.
గుజరాత్‌లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను డిపాజిట్ చేసుకున్నట్టు తెలిసింది. అందులో ఒకటి అహ్మదాబాద్‌ డీసీసీబీ అయితే, రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. అహ్మదాబాద్ డీసీసీబీ బ్యాంకుకి, అమిత్‌షా 2000 వ సంవత్సరంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కొన్నేళ్లుగా డైరెక్టర్‌గా ఉన్నారు. 2016 నవంబర్ 8న మోదీ నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కేవలం ఐదు రోజుల్లోనే ఈ బ్యాంకులో రూ. 745.59 కోట్ల విలువైన నోట్లు జమ అయ్యాయి. కొన్ని రోజులకు డీసీసీబి బ్యాంకులో చాలామంది నల్లధనాన్ని డిపాజిట్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం వల్ల ఆ బ్యాంకు రద్దయిన నోట్లను డిపాజిట్ చేయడాన్ని ఆపేసింది. అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగినా ప్రభుత్వం ఎటువంటి విచారణ జరపలేదు. 2017 మార్చి నాటికి అహ్మదాబాద్‌ డీసీసీబీ బ్యాంకులో రూ. 5050 కోట్లు జమయ్యాయి. ఇది ఎంత ఎక్కువ మొత్తమంటే, రాష్ట్ర సహకార బ్యాంకు డిపాజిట్లు కేవలం రూ. 1.11 కోట్లు మాత్రమే… ఇక రాజ్‌కోట్ డీసీసీబి బ్యాంకులో రూ. 693.19 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఈ బ్యాంకు చైర్మన్‌ జయేశ్ భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా.. ప్రస్తుతం ఈయన గుజరాత్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.

బ్యాంకులు సైతం..!

ఈ ఒక్క ఉదాహరణ చాలేమో…నోట్ల రద్దు వల్ల ప్రజలు కాదు రాజకీయనాయకులు ఎంత లాభపడ్డారో చెప్పడానికి. ప్రజలు మాత్రం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎంతలా అంటే ఈ వ్యవహారం వల్ల డిజిటల్ మనీతో ప్రజలందరూ…డబ్బు చేతిలో పట్టుకునే బరువు దించామని చెప్పిన మోదీ ప్రభుత్వం, బ్యాంకుల బరువుని ప్రజల శరీరాలపై మోపారు. ఇపుడు ప్రజలు తమ సొంత డబ్బులు డిపాజిట్ చేయాలన్నా ఎంతో కొంత సొమ్ము బ్యాంకులకు చెల్లించాలి. ఐదువేలు సంపాదించే వ్యక్తి అయినా సరే బ్యాంకు బ్యాలెన్స్ మినిమం వెయ్యి రూపాయలు మెయింటేన్ చేయాలి.

ఇంకో ఆరునెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నోట్ల రద్దువల్ల ప్రజలు మారిపోతారు, నేను తీసుకున్న నిర్ణయం గొప్ప మార్పుకి పునాది అని చెప్పుకున్న మోదీ వచ్చే ఎన్నికలకు ఎలాంటి స్పీచ్‌ని సిద్ధం చేసుకుంటారో చూడాలి. 2014 ఎన్నికల్లో చెప్పిన మరో మాట. నల్లధనం అంతం అయితే అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరికీ 15 లక్షలు వచ్చి చేరుతాయని. ఇన్నాళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంకు తేల్చిందేంటంటే నోట్ల రద్దు జరగడం వల్ల దేశంలో చెలామణిలో ఉన్న 1000, 500 నోట్లలో 99.3 శాతం తిరిగి మళ్లీ బ్యాంకులకే చేరాయని. అలాంటపుడు మోదీ చెప్పిన కారణాల్లో ఏదీ నెరవేరలేదనే ఒప్పుకోవాలి. కానీ మన దేశ ఆర్థిక మంత్రి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా…కాదు ఘంటాపథంగా చెబుతున్న విషయం. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగిందని…పన్ను వసూళ్లు పెరిగాయని, అభివృద్ధి రేటు కూడా పెరిగిందని చెప్పారు. ఇది ప్రజలకు తెలిసిన రాజకీయ క్రమబద్దీకరణనా, లేక ప్రజలకు తెలియని ఒట్టి ప్రకటనల క్రమబద్దీకరణనా అనేది 2019 ఎన్నికలు వచ్చాక తెలుస్తుంది. 2014 లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కొత్త ఎన్నికలకు ఎలాంటి మాయలమంత్రదండం తీస్తారో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *