తుఫాను కౌగిట్లో గుజరాత్ తీరం!

తుఫాను కౌగిట్లో గుజరాత్ తీరం!

సైక్లోన్ వాయు గుజరాత్ తీరాన్ని జూన్ 13న తాకనుంది. ఈ తుఫాను గంటకు 130-135 కి.మీల వేగంతో ముందు దూసుకొస్తోంది. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు హోమ్ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని విధాలైన ప్రత్యామ్నాయ ఉపాయాలను ముందుగానే చేపట్టాల్సిందిగా సూచించారు.

మరోవైపు తుపానుతో టెలికమ్యూనికేషన్స్, తాగునీరు, విద్యుత్ వంటి సేవలకు అంతరాయం కలగకుండా చూడాల్సిందిగా షా అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు పనిచేసేలా చూడాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ 26 బృందాలను ఇప్పటికే రంగంలోకి దించారు. గుజరాత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపుతున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ యూనిట్లను కూడా సిద్ధంగా ఉంచారు. సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ నిరంతరం ఆకాశమార్గాన నిఘా ఉంచాయి.

ఇక తుఫానుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హోమ్ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం గుజరాత్ తో పాటు మహారాష్ట్రపై కూడా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ.. సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల్లో జూన్ 14న భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 110 కి.మీల వేగంతో తుఫాను గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ఈ తుఫాను కారణంగా రుతుపవనాలపై ప్రభావం పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది జూన్ 13 ఉదయం గుజరాత్ తీర ప్రాంతాల్లోని పోర్ బందర్ నుంచి మహువా, వెరావల్, దీవ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇటు ఈ తుఫాను అరేబియా సముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతంలో గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఏర్పడింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించింది. స్కూళ్లు, కాలేజీలకు జూన్ 13, 14న సెలవులు ప్రకటించింది. ఇటీవల ఫోనీ తుఫాను ఎదుర్కొన్న ఒడిషా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *