చంద్రబాబు గెలిచే అవకాశముందనేనా?

చంద్రబాబు గెలిచే అవకాశముందనేనా?

మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకున్నారు. కనిపిస్తే చాలు కారాలు మిరియాలు నూరుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరు కలిసిపోయారు. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే రెండు మీటింగులు అన్నట్టు ముందుకు సాగుతున్నారు.

ఎన్నికల తర్వాత ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంటూ వచ్చింది. పోలింగ్ అలా ముగిసిందో లేదో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందంటూ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో సమీక్షలంటూ హడావిడి చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల ఉందన్న కారణంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలవడం మానేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు చంద్రబాబు.

సీఎస్ ఎన్డీయే ప్రభుత్వం చెప్పినట్టే వింటున్నారంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈసీ తీరును కూడా నిరసించారు.అటు సీఎస్‌ కూడా ఎన్నికల కోడ్‌ పేరుతో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఫలితంగా సీఎం వర్సెస్ సీఎస్ గా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మారిపోయింది. ఇలా కొనసాగుతున్న ఏపీ పరిణామాల్లో ఇప్పుడు సడన్ ట్విస్ట్ . నిప్పు-ఉప్పు లా ఉన్న సీస్ -సీఎం భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

సీఎస్ సడన్‌గా సీఎంను కలవడం వెనుక, కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది.చంద్రబాబు గెలిచే అవకాశం ఉంది కాబట్టే .. అనవసరమైన గొడవ ఎందుకని సీఎంని, సీఎస్ కలిసారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *