క్రాస్ ఓటింగ్‌పైనే జేడీ ఆశలు

క్రాస్ ఓటింగ్‌పైనే జేడీ ఆశలు

విశాఖ లోక్‌సభ స్థానంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ కాస్త, క్రాస్ ఓటింగ్‌తో మరొకరి విజయానికి అవకాశంగా మారినట్లు టాక్ నడుస్తోంది. చీలిన ఓట్లు జేడీ లక్ష్మీనారాయణకు మేలు చేసినట్టుగా అంచనా వేస్తున్నారు. అది అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సాంప్రదాయ ఓట్లతో పాటు మార్పు కోరుకుంటున్న అర్బన్ ఓటర్లు, పవన్ అభిమానులు జేడీకి ఓటేసినట్లు తెలిసింది.

విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో ఈసారి భిన్న తీర్పు ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం లోక్ సభ పరిధిలో విశాఖ ఈస్ట్‌, వెస్ట్, నార్త్, సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు… భీమిలి, గాజువాక, శృంగవరపుకోట సెగ్మెంట్స్ ఉన్నాయి. గాజువాకలో జనసేన అధినేత పవన్‌ పోటీ చేశారు. మిగిలిన స్థానాల్లోని అభ్యర్థులు బలహీనంగానే ఉన్నారు. వారు వ్యక్తిగతంగా పెద్దగా తెలిసినవారు కాకపోవడంతో, అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. అయితే ఒక్క శృంగవరపు కోట మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పెద్ద ఎత్తున ఓట్లు చీలి, లక్ష్మీనారాయణకు ప్లస్‌గా మారాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

విశాఖపట్నం ఎంపీ స్థానంలో ఈసారి హేమాహేమీలు బరిలో దిగారు. బీజేపీ తరఫున మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ నుంచి ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌, వైసీపీ నుంచి ఆర్థికంగా బలవంతుడైన ఎంవీవీ సత్యనారాయణ బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి భరత్‌ కూడా గట్టి పోటీనిచ్చారు. ఈయన తరఫున పలువురు దిగ్గజ నేతలు ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉండడం, ఎమ్మెల్యేలందరూ పూర్తిస్థాయిలో సహకరించడం భరత్‌కు కలిసొచ్చిన అంశాలు. జనసేన తరపున లక్ష్మీనారాయణ బరిలో దింపడంతో ఇక్కడ పరిస్థితులు తారుమారైనట్టుగా అంచనా.

లక్ష్మీనారాయణ స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని చెప్పడం ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారట. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చన్నారు లక్ష్మీనారాయణ. వందరూపాయల బాండ్‌ పేపర్‌పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే, ఇక నగరంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ఓటర్లతో వారి భాషల్లో మాట్లాడడం కూడా ఆయనకు కలిసివచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష్మీనారాయణ పెద్దగా తెలియరని కొంతమంది భావించారు. కానీ, అక్కడ కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు స్పష్టమవుతోంది. పవన్‌కల్యాణ్‌ ప్రస్తావన లేకుండా కేవలం లక్ష్మీనారాయణ ఇమేజ్‌ను చూసే అంతా ఓట్లు వేశారని చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం, వైసీపీ అభిమానుల్లో చాలామంది ఎమ్మెల్యే ఓటును ఆ పార్టీ అభ్యర్థికి వేసుకుని, ఎంపీ ఓటు మాత్రం లక్ష్మీనారాయణకు వేశారట. విశాఖపట్నంలో తటస్థ ఓటర్లుగా ఉన్న విద్యావంతుల్లో…ఎక్కువ మంది లక్ష్మీనారాయణకు ఓటు వేసినట్టు చెబుతున్నారు. దీంతో ఆయన గెలుపుపై జనసేనలో ఆశలు పెరిగాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *