ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్‌...

ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్‌...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.నిన్నామొన్నటి వరకు మోగిన మైకులు సైలెంట్‌ అయ్యాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది.సభలు,రోడ్‌షోలతో చివరి రోజు అధికార టీడీపీ,ప్రధాన ప్రతిపక్ష వైసీపీ సహా జనసేన,బీజేపీ పార్టీలు హోరాహోరీగా పటీ పడ్డాయి.అంతేకాదు..ప్రధాన పార్టీల అధినేతలు పంచ్‌ డైలాగ్‌లు పేలుస్తూ..లాస్ట్‌ డే క్యాంపెయిన్‌లో అన్ని వర్గాలపై వరాల వర్షం కురిపిస్తూ మెరుపులు మెరిపించారు.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.మరికొద్ది గంటల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఏపీ అసెంబ్లీతో పాటు..ఏపీలో 25 ఎంపీ స్థానాలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని ఎలక్షన్‌ కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని,అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను,సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామని వెల్లడించారు.అటు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలాఉంటే..ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అన్నారు.దేశంలోనే అత్యధికంగా నగదు,బంగారం ఏపీలో స్వాధీనం చేస్తున్నామని తెలిపారు.ఇక ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 85వేల మంది సిబ్బందిని వినోయోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు..ఏపీలోని మన్యం ప్రాంతాలు,మావోలు సంచరించే ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్‌ భద్రత కట్టుదిట్టం చేసింది.అయితే భద్రత పెంచినప్పటికీ కొన్ని పోలింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.దీంతో ఇప్పటికే పాడేరు,అరకు నియోజకవర్గాల్లోని 14 పోలింగ్‌ బూత్‌లను విలీనం చేస్తూ ..ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఇదిలాఉంటే ఎన్నికల్లో గెలుపుపై పార్టీలు ఎవరి అంచనాల్లో వారున్నారు.అభ్యర్థులంతా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్నికల్లో గెలుపెవరిదన్న దానిపై బెట్టింగ్‌రాయళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *