బిల్లు కట్టలేదని అవయవాలు దోచుకున్న హాస్పిటల్!

బిల్లు కట్టలేదని అవయవాలు దోచుకున్న హాస్పిటల్!

ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతేనో, యాక్సిడెంట్ జరిగితేనో డబ్బు కంటే ప్రాణాలు ముఖ్యమని ఆలోచిస్తాం.ఈ బలహీనతలని ప్రైవేటు ఆసుపత్రులు వారి ధనదాహానికి వాడుకుంటున్నాయి.ఎవరైనా హాస్పిటల్‌లో చేరితే వారి నుంచి ఎంత డబ్బు లాగాలనే ఆలోచన తప్పించి వచ్చిన వ్యక్తుల ఆరోగ్యాన్ని బాగుపరిచే స్పృహ ఉండట్లేదు.ఇప్పటిదాకా చూసిన ప్రైవేటు హాస్పిటల్ ఆగడాలు ఒకెత్తైతే ఇపుడు చదవబోయేది అన్నిటికీ మించిన పరాకాష్ట. ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించి ఫీజు కట్టలేదని అవయవాలు కాజేసిన నీచం నెల్లూరు జిల్లాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది.

నెల్లూరు జిల్లా ఆలూరు మండలం వడ్డెపుగుంట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకోలు శ్రీనివాసులు అనే వ్యక్తిని మోటారు సైకిల్ ఢీ కొట్టడంతో గాయపడ్డాడు. బైక్‌తో ఢీ కొట్టిన వ్యక్తే అతడిని చికిత్స కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలు చెల్లించి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసులు భార్య అరుణ ఆస్పత్రికి చేరుకుంది.  ప్రమాదంలో ఆమె భర్త మెదడుకు దెబ్బతగిలిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసినా బతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెప్పి…అప్పటి వరకు జరిగిన వైద్యానికి లక్ష రూపాయలు చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యం అడిగింది. అంత డబ్బు తన దగ్గర లేదని ఆమె హాస్పిటల్ వర్గాలకు చెప్పింది.  ఆ తర్వాత… మధ్యాహ్నానికి శ్రీనివాసులుకి బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు.

అప్పటిదాకా చేసిన చికిత్స కోసం లక్ష రూపాయలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్ళమని వైద్యులు తెలిపారు. అంత డబ్బు తన దగ్గర లేదని అతని భార్య నిస్సహాయతను వ్యక్తం చేయగా… భర్త అవయవాలు దానం చేయాలని, అది చేస్తే లక్ష  రూపాయలు కట్టాల్సిన పనిలేదని,మీ కుటుంబానికి జీవితాంతం ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి,కొన్నికాగితాలు ఇచ్చి ఆమెతో సంతకం చేయించుకున్నారు.అనంతరం శ్రీనివాసులు శరీరంలోంచి కళ్లు, కిడ్నీలు, గుండె, తీసుకుని మృతదేహాన్ని అప్పచెప్పారు.ఆ తర్వాత చాలా ఆలస్యంగా ఆమెకు విషయం అర్థం అయింది.భర్త శరీరంలోంచి ప్రధాన భాగాలు తొలగించారని తెలిసి దుఃఖించింది. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుకు కంప్లైంట్ చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు.చంద్రన్న బీమా పథకం ద్వారా  ఆమెకు సహాయం అందించారు. తెల్లరేషన్ కార్డును మంజూరు చేసి ఆమె పిల్లలకు చదువులో సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *